విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం కృషి చేయాలి.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ..రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
TS తెలుగు న్యూస్ 24/7:సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన 100 రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ప్రతి విద్యా సంవత్సరంలో 100 రోజుల పాటు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమం అభినందనీయమని,ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి,జాతీయ భావాన్ని పెంపొందించడంతో పాటు దేశం పట్ల గౌరవం, బాధ్యతను పెంచుతాయని తెలిపారు.అనంతరం విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ…విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా ఎదగాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించి మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలన్నారు.ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని,మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్,రాంగ్ రూట్‌లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఇతరులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడాలని,ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఎవరితో కూడా పంచుకోవద్దని సూచించారు.సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు,ఫేక్ లింకులు,పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు,గిఫ్ట్ ఆఫర్లు,లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్,ఎస్.ఐ సాయి కిరణ్, ప్రిన్సిపాల్ విజేయ్ రగునందన్,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.





