తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో ప్రారంభించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని జడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహార పదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. వారితో పాటు గ్రామ సర్పంచ్ శివ కుమార్, ఎంపీటీసీ లక్ష్మీ, డాక్టర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
