– కమలం పార్టీ లో…పాతతరం నాయకులతో విస్తృత సంప్రదింపులు
– రఘునందన్ కు వ్యతిరేకంగా సమావేశాలు
-బూతులెవల్లో సమావేశాలకు ప్రణాళికలు
– కాక లేపుతున్న దుబ్బాక బిజెపి అసంతృప్తి వ్యవహారం
దౌల్తాబాద్: దుబ్బాక బిజెపిలో సీనియర్ల ఏకీకరణ వేగవంతంగా జరుగుతుంది. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం స్తంభంగా ఉన్న నాయకత్వాన్ని ఏకతాటి పైకి తీసుకువచ్చి ముందుకు నడిపించే ఆలోచనలో కొందరు సీనియర్ నాయకులు ఇటీవల కాలంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుదేవా రెడ్డి, గతంలో పోటీ చేసి ఓటమిపాలైన గిరీష్ రెడ్డి పాత నాయకత్వాన్ని ఏకీకృతం చేయడంలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల దుబ్బాకలో సమావేశం నిర్వహించిన సీనియర్ ఇప్పుడు మిరుదొడ్డిలో నిర్వహించిన సమావేశం దుబ్బాక బీజేపీలో కాక రేపుతోంది. బూత్ స్థాయి నాయకులనుండి పాతవారిని ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బలమైన వ్యతిరేక వర్గాన్ని తయారు చేయడంలో సీనియర్లు తళామునకులైనట్లు తెలుస్తోంది. బూత్ పై కార్యకర్త నుండి మండల స్థాయి నాయకుల వరకు గతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని గుర్తించి వారికి పార్టీలో సరైన గుర్తింపు లభించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తూ వారిని ఏకం చేయడం కోసం వీరు వరుస సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందన్ రావు సీనియర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై..నిరసనగా వీరంతా ఏకమవుతున్నారు. కాగా రాష్ట్ర రాజకీయాలలో దుబ్బాక బీజేపీ అసంతృప్తి వ్యవహారం సంచలనం గా మారింది… వచ్చే ఎన్నికల్లో మరింత రసవత్తంగా మారే అవకాశం ఉంది. సీనియర్ల తిరుగుబాటు బిజెపిలో కలవరం రేపుతోంది. కాగా వచ్చే సాధారణ ఎన్నికలలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ ఎంపీగా పోటీ చేస్తే దుబ్బాక సీటు పాత నాయకులకే ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలలో మంచి వాగ్దాటితో.. పేరు సంపాదించిన ప్రస్తుత శాసనసభ్యులు రఘునందన్ రావుకు వ్యతిరేకంగా చాప కింద నీరుల సీనియర్ ఏకమవుతుండడం కొంత కలవర పెట్టే విషయం.