పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ఆపదని తెలవడమే పరమావధిగా కష్టాలలో ఉన్న వారి కన్నీళ్లు తుడవడమే నిజమైన మానవత్వమని పల్లె పల్లెకు తిరుగుతూ నిరుపేద ప్రజలకు సేవ చేస్తూ మానవత్వానికి నిదర్శనం నిలుస్తున్నారు సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. దుబ్బాక మండలం చెర్వపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పిట్ల వెంకటయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకొని ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊరు ప్రాంతం తేడా లేకుండా నిరుపేద ప్రజలు ఎక్కడ ఆపదలో ఉంటే అక్కడికి వెళ్లి తమ వంతు సహాయం చేసి ఆదుకోవడం జరుగుతుందన్నారు. చేర్వపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పిట్ల వెంకటయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం చాలా బాధాకరమని, అతనికి భార్య లక్ష్మి, ముగ్గురు కూతురులు రేణుక, యాదమ్మ, లావణ్య ఉన్నారు. కూతురుల వివాహాల కోసం ఉన్న కాస్త ఆస్తిపాస్తులు అమ్మేసి వారి పెళ్లిళ్లు చేశారు. ఇప్పుడు నివాసం ఉండడానికి చిన్నపాటి ఇల్లు మాత్రమే మిగిలింది. వెంకటయ్య భార్య లక్ష్మి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరి పరిస్థితి చాలా విషాదకరంగా ఉందన్నారు. తన వంతుగా వీరి కుటుంబానికి సహకారం అందించడం జరిగిందని ఇంకా మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి వీరి కుటుంబానికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మూర్తి నరేష్ రెడ్డి, గ్రామస్తులు మంద శ్రీనివాస్, నరేష్, యాదగిరి, ఎల్లం, హరీష్, వంశీ, నరేందర్, మహమ్మద్ ఉమర్, ఇమ్రాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
