ముస్తాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 30, డిసెంబర్ 31న స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో డిసెంబర్ 31 వేడుకలను పోలీసుల సూచనల మేరకు శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేసి డిసెంబర్ 31న సాయంత్రం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మైనర్స్‌కి బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సైలెన్సర్‌లను తీసి వాహనాలు నడపడం శబ్ధ కాలుష్యం చేయడం, అధిక వేగంతో వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ హెల్మెట్ ధరించకపోవడం నూతనంగా ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి నెంబర్ ప్లేట్ గడువు కాలం పైపడినచో అవర్చుకోకపోవడంవల్ల నెంబర్ లేకుండా నెంబర్ ప్లేట్లపై ఎలాంటి మాస్కులు ధరించరాదని ఇతరులను ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయరాదన్నారు. రోడ్లపై టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదన్నారు. డీజేలను నిషేధించినట్లు పేర్కొన్నారు. డీజేలు వాడితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇండ్ల పైన, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాలపై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెడితే సహించబోమన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధించామని, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు. నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ రాహుల్ హెగ్డే పిలుపునిచ్చారు.
