
వీర్నపల్లి పరిధిలోని తండాల్లో ఎక్సైజ్ దాడులు: ఇద్దరి అరెస్టు
200 లీటర్ల బెల్లం పులిసిన వాష్ ధ్వంసం,6 లీటర్ల నాటుసారా స్వాధీనం.
TS తెలుగు న్యూస్ 24/7:అక్రమ నాటుసారా తయారీ,విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రెండ్ల విజయేందర్ స్పష్టం చేశారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీర్నపల్లి మండల పరిధిలోని వివిధ తండాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విస్తృతంగా దాడులు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిబ్బంది,సిరిసిల్ల డీటీఎఫ్ బృందం సంయుక్తంగా వీర్నపల్లి మండల పరిధిలోని గోలియానాయక్ తండా,భూక్య తండా,మద్దిమల్ల తండా,బంజరు తండాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ దాడుల్లో భూక్య తండాలో అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్నట్లు గుర్తించి రెండు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా భూక్య తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 లీటర్ల అక్రమ నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా తండా పరిసరాల్లో నాటుసారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లం పులిసిన వాష్ (FJ వాష్)తో పాటు తయారీ సామగ్రిని గుర్తించి అక్కడికక్కడే నేలపై పారబోసి ధ్వంసం చేశారు. మొత్తం 4 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా,నిల్వ ఉంచినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రబ్బానీ,కానిస్టేబుళ్లు రవీందర్,మారుతి,డీటీఎఫ్ సిబ్బంది మహేష్,వర్మ,శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.





