సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మార్కెట్ యార్డులో జ్యోతి రావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1848లో మారుమూల ప్రాంతంలో పాఠశాలను స్థాపించి, దేశంలో మొట్టమొదటిసారి ఆడపిల్లలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తి జ్యోతి రావు పూలే అని కొనియాడారు. అదేవిధంగా నిరక్షరాస్యులైన తన భార్య సావిత్రిబాయి పూలే ను చదివించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారన్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు, మహిళల పట్ల వివక్షతను నిర్మూలించడానికి మహాత్మ జ్యోతిరావు పూలే అభిరాళంగా కృషి చేశారని, ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు సమాజంలో ఆడపిల్లలు వివక్షత లేకుండా అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారన్నారు. నేటి, భవిష్యత్తు తరాలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు.