పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ
తప్పిన పెను ప్రమాదం, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్
సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7, డిసెంబర్ 7
హనుమకొండ నుండి హుస్నాబాద్ వస్తున్న లారీ పోలీస్ జీపును ఢీకొన్న ఘటన హుస్నాబాద్ మండలం జిల్లలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది.ఈ సందర్బంగా వివరాల్లోకి వెళితే హనుమకొండ నుండి హుస్నాబాద్ వైపు వెళ్తున్న చేపల లోడ్ లారీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర నిలిపి ఉంచిన వాహనాన్ని, భారీ కేడ్లను అర్ధరాత్రి వేళ వేగంగా ఢీకొట్టింది. దీంతో పోలీసు జీపు సుమారు 200 మీటర్ల దూరం వరకు వెళ్లి పంట పొలాల్లోకి దూసుకెళ్లిపోయింది. కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో జీప్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ అదే వేగంతో వెళ్లి ప్రక్కకు పడిపోగా చేపలతో నిండి ఉన్న బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయాయి.లారీ డ్రైవర్ మరియు క్లీనర్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ ఇరువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ఏసిపి, సీఐ,ఎస్ఐ రోడ్డుకు ఇరువైపులా పడి ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో తీసి వేయించి రోడ్డుపై వెళ్లే వాహనాలకు లైన్ క్లియర్ చేశారు.చేపలను గ్రామ ప్రజలు దొరికినవి దొరికినట్లు తీసుకెళ్లారు.





