సర్కారు దవాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫా స్కానింగ్ యంత్రాలను పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా టిఫా స్కానింగ్ మిషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 100 మందిలో ఏడు శాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటిని టీఫా స్కాన్స్‌తోనే గుర్తించడం సాధ్యమన్నారు. పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని, రాష్ట్రంలో 99.2శాతం ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీలు జరిగాయన్నారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల-ఆసుపత్రిలో శనివారం సాయంత్రం జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, డీఏంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలా థామస్, సూపరింటెండెంట్ కిషోర్, వైద్య అధికారులు హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 టిఫా స్కానింగ్ మిషన్లు ప్రారంభం చేసుకోవడం అదృష్టం అని జెడ్పీ చైర్మన్ రోజాశర్మ చెప్పారు. సీఎం కేసీఆర్, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజానీకం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య విషయంలో 3వ స్థానంలో నిలిచేలా చేసిన కృషిని గుర్తు పెట్టుకోవాలని కోరారు. సిద్ధిపేట, గజ్వేల్ లో టిఫా స్కానింగ్ మిషన్లు ప్రారంభంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కుదిరిందని, ఆసుపత్రులలో డెలివరీల సంఖ్య పెరిగిందని, స్కానింగ్ కోసం బయటకు వెళ్లకుండా గర్భిణీ స్త్రీలు అందరూ ప్రభుత్వ దవాఖానలొనే స్కానింగ్ చేయించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.




