కష్టాలలో ఉన్న పేద ప్రజలకు ఎల్లప్పుడు ఎస్ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటూ వారిని ఆదుకోవడానికి కృషి చేస్తుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శనివారం దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి మల్లేశం కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచి వారి కుటుంబాలకు తోచిన సహాయం చేయాలని సదుద్దేశంతో ఎస్ ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. దానిలో భాగంగానే దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దొడ్డి మల్లేశం అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. మృతుడు మల్లేశంకు భార్య లక్ష్మి కుమారులు పవన్ కళ్యాణ్, నితిన్ ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేకపోతే గ్రామస్తులు చందాలు వేసుకొని అంతక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. కనీసం నివాసం ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో టార్పాలిన్ కవర్ తో వేసుకున్న గుడిసెలో నివాసం ఉంటున్నారు. అలాంటి నిరుపేద కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానవత్వంతో ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున బియ్యం నిత్యవసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఇంకా మానవతావాదులు, నాయకులు సహృదయంతో ఇలాంటి నిరుపేద కుటుంబానికి సహాయం చేసి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పసి నర్సింలు, ప్రభాకర్, ఎల్లం, వెంకట్, యాదగిరి, అంజి, స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




