మే 3, 24/7 తెలుగు న్యూస్ :గళమెత్తిన విద్యార్థిలోకం
యుద్ధోన్మాదంతో పాలస్తీనా ప్రజలను బలిగొంటున్న ఇజ్రాయిల్ పాలకుల అమానుషత్వాన్ని, నిరంకుశత్వాన్ని నిరసిస్తూ, అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థిలోకం పెద్దపెట్టున గళం వినిపిస్తోంది. తక్షణమే ఈ దారుణ మారణ హోమానికి స్వస్తి పలకాలని డిమాండు చేస్తోంది. కళ్లెదుటే జరుగుతున్న ఘోరకలిని అడ్డుకోకుండా, ఆ అకృత్యాన్ని అడ్డదారుల్లో ఎగదోస్తున్న అమెరికా పాలకులకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు. నిరసన గళాలను ఎలాగైనా అదిమేయాలని దుందుడుకు చర్యలకు దిగుతోంది. ఒకపక్క భావ ప్రకటనాస్వేచ్ఛకు భంగం కలిగించబోమని చెబుతూనే, యూనివర్సిటీల్లో అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించింది. గొంతెత్తిన విద్యార్థులను అప్రజాస్వామికంగా అరెస్టు చేయించింది. క్రమశిక్షణ చర్యల పేరిట వేధింపుల పర్వానికి తెర తీసింది. భయపెట్టాలనుకోవటం ద్వారా కాదు; భరోసా ఇవ్వటం ద్వారా మాత్రమే ఆగ్రహావేశాలు చల్లారతాయన్న ప్రజాస్వామిక సూత్రాన్ని విస్మరించింది. విశ్వ విద్యాలయాలంటే వేయి ఆలోచనలు సంఘర్షించి, నూరు భావాలు వికసించే విజ్ఞాన ప్రాకారాలు. సర్వ మానవాళి సుఖసంతోషాలతో వర్థిల్లటానికి కొత్త ఆలోచనలూ, ఆచరణలూ మోసులెత్తాల్సిన అక్షర క్షేత్రాలు. అలాంటి చోట, స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు తమదే గొప్ప దేశమని బాజాలు భజాయించే చోట నిరసన గళాలపై అమెరికా అధికార గణం విరుచుకుపడుతున్న తీరు దాని ద్వంద్వ ప్రమాణాలకు, దౌర్జన్య కాండకూ అద్దం పడుతోంది.
అసలు అమెరికా అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు ఇంతగా హోరెత్తటానికి కారణం ఏమిటి? దాదాపు ఏడు నెలల నుంచి ఇజ్రాయిల్ బలగాలు విచక్షణారహితంగా పాలస్తీనా ప్రజల మీద పాశవికంగా యుద్ధకాండ సాగిస్తున్నా – అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు. నెతన్యాహు రక్తదాహానికి ఇప్పటికే 35 వేల మంది బలయ్యారు. అందులో 14 వేల మంది పిల్లలే! హాస్పటళ్ల మీద, శరణార్థి శిబిరాలపైనా, ఆకలితో నకనకలాడుతున్న నిరాశ్రయుల పైనా, పాఠశాలల పైనా బాంబులతో, కాల్పులతో ఇజ్రాయిల్ మూకలు విరుచుకుపడుతున్నా అమెరికా ‘అయ్యో .. పాపం!’ అనటం లేదు. అంతర్జాతీయ సమాజం తీవ్రంగా విమర్శిస్తున్నా, ఈ పైశాచికాన్ని ఆపాలని సూచిస్తున్నా ఇజ్రాయిల్ లెక్క పెట్టటం లేదు. పాలస్తీనా భూభాగాన్ని దౌర్జన్యపూరితంగా ఆక్రమించటమే కాక, ఓ పక్కకు జరిగిపోయి తల దాచుకుంటున్న ఆ దేశ ప్రజలపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఈ దురాక్రమణదారుకు అమెరికా అన్ని వేళలా ఆయుధ, ఆర్థిక, దౌత్యపరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. ఈ ధూర్త ధోరణిపై ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలు అభ్యంతరం చెబుతున్నా దాని వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. అమెరికా దన్ను చూసుకొని, ఇజ్రాయిల్ యుద్ధాన్ని అంతకంతకూ విస్తరిస్తోంది.
వర్తమాన కాలంలో ఈ భూగోళం మీద ఇంతటి యుద్ధోన్మాదం చెలరేగుతున్నప్పుడు విశ్వవిద్యాలయాలు, విద్యార్థులూ స్పందించటం సహజ పరిణామం. దానిని కూడా బైడన్ – నెతన్యాహు జోడీ వక్రరీతిన వ్యాఖ్యానించే దుస్సాహసం చేసింది. విద్యార్థుల యుద్ధ వ్యతిరేక గళాన్ని యూదు వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. నిరసనల ఉద్దేశాన్ని పాఠంగా తీసుకొని, యుద్ధకావరాన్ని వదులుకోవాల్సింది పోయి, విద్యార్థులను మరింత రెచ్చగొట్టే ఉన్మాద ప్రేలాపనలకు బరి తెగించింది. అరెస్టులు, కేసులు, బహిష్కరణలు, పోలీసు మోహరింపులు, అశ్విక దళాల ఉసిగొలుపు చర్యలతో యూనివర్సిటీల్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది.
జరుగుతున్న పరిణామాలన్నిటినీ ప్రపంచం కళ్లారా చూస్తోంది. అమెరికా ఇకనైనా కళ్లు తెరచి, యుద్ధోన్మాద నెతన్యాహుకి కళ్లెం వేయాలి. నిరంకుశ, నిరంతర మారణహోమానికి స్వస్తి చెప్పించాలి. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల నుంచి తక్షణమే వైదొలగి, అక్కడి ప్రజలకు కలిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలి. ఇజ్రాయిల్ బేషరతుగా అలా వ్యవహరించేలా దానికి దాపుగా నిలిచిన అమెరికాయే అన్ని చర్యలూ చేపట్టాలి. అలాకాక విద్యార్థుల నిరసనలపై అణచివేత చర్యలను కొనసాగిస్తే- అది దాని పక్షపాతాన్ని, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణినీ ప్రదర్శించడమే అవుతుంది. బంతిని బలంగా నేలకేసి కొడితే, అది అంతే బలంగా పైకి లేస్తుంది. ఇది మరవకూడని ప్రకృతి సూత్రం!