మే 1, 24/7 తెలుగు న్యూస్ :మే డే..
మేడే అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు కార్మిక హక్కుల దినోత్సవం. విభేదించమేవలసిన దేమీ లేదు. కానీ భారతదేశంలో మొదటి కార్మిక ఉద్యమం నడిపింది మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజంలో సభ్యుడైన నారాయణ మేఘాజి లోకండే మరియు జ్యోతిరావు పూలే సామాజిక సిద్ధాంతం నమ్మిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్న విషయాన్ని భారత కార్మికులు మరువకూడదు. 1886 మే నెలలో చికాగో నగరం హే మార్కెట్లో జరిగిన హింస, మారణకాండ ఈ కార్మిక పండుగకు మూలం . అయితే భారతదేశంలో బాంబే నగరంలో (అంటే నేటి ముంబై నగరం) 1884 లోనే రావ్ బహదూర్ అని బిరుదు పొందిన నారాయణ మేఘాజీ లోకండే కార్మిక యూనియన్ను ” బాంబే మిల్ హాండ్స్ అసోసియేషన్” అనే పేరుతో స్థాపించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1928 లోనే నూలు మిల్లు కార్మికుల సమ్మెను ప్రారంభించడమే కాక మన దేశ రాజ్యాంగంలో తను నమ్మిన సామాజిక ఆర్థిక న్యాయ సూత్రాలను హక్కుల రూపంలో పొందుపరిచారు.
నారాయణ మేఘాజి లోకండే 1880 లోనే కార్మిక కర్షకుల స్థితిగతులను తెలిపేదానికి “దీనబంధువు” అనే తొలి కార్మిక కర్షక పత్రికను ప్రారంభించారు.1884లో పెద్ద కార్మిక సభను నిర్వహించి కార్మికుల సమస్యలైన పనిగంటలు తగ్గింపు, మధ్యాహ్నం భోజన విరామం, వారాంతపు సెలవు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు.1890 లో నియమించిన ఫ్యాక్టరీ కమిషన్ లో సభ్యుడుగా ఉన్నారు.1890 నాటికి ఆయన తలపెట్టిన డిమాండ్లు వారాంతపు సెలవుతో సాధించుకున్నారు.1897 ఫిబ్రవరి 9న ప్లేగు వ్యాధి రోగులకు సేవ చేస్తూ తెలుగు వ్యాధితో మరణించారు.
కార్మిక ఉద్ధరణలో డాక్టర్ అంబేడ్కర్ పాత్ర
విదేశీ విద్యను పూర్తి చేసుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత డాక్టర్ అంబేడ్కర్ బొంబాయి నగరంలో లా కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరారు. అక్కడ అంటరాని వాడైన అంబేద్కర్ కు ఎక్కడ ఇల్లు దొరకలేదు. చివరకు ఒక లేబర్ కాలనీలో అద్దెకు చేరారు. అక్కడ ఒక అంతస్తులో ఒకటే కక్కుస్ దొడ్డి. స్నానానికి, బట్టలు ఉతుక్కునేదానికి, అంట్లు తోముకునే దానికి ఒక్కొక్క అంతస్తుకు ఒకటే పంపు. అది కార్మిక సమస్యల పట్ల పూర్తి అవగాహన వచ్చింది. స్వతహాగా అంటరానివాడైన డాక్టర్ అంబేద్కర్ కు ఆ సమస్యలు అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. అందువలనే కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఆయన నిజాయితీతో నిలబడ్డారు.
1928 నూలు మిల్లు కార్మికుల సమ్మె
1928లో నూలు మిల్లు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయవలసి వచ్చింది. ఆ సమ్మెలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సమ్మె దీర్ఘకాలం నడిచింది. నూలు మిల్లులలో పనిచేస్తున్న వారిలో అంటరాని కులానికి చెందిన కార్మికులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఒక విషయాన్ని గమనించారు. అక్కడ పనిచేస్తున్న అంటరాని కులాల కార్మికులకు వీవర్స్ గా ప్రమోషన్ ఇచ్చే దానికి అవకాశం లేదట. ఎందుకని ప్రశ్నించినప్పుడు యాజమాన్యం చెప్పిన మాటలు వీవర్స్ గా ప్రమోషన్ ఇవ్వకపోవడానికి కారణం, నేత నేసేటప్పుడు నూలు పోగులు తెగిపోతుంటాయి. వాటిని వీవర్స్ నోటి లాలాజలంతో తడిపి అంటించాలి. అందువలన అంటరాని కార్మికుల లాలాజలంతో అంటించిన నూలు పోగులను తాకి మిగతావాళ్లు మలినం అవుతారని ఇక్కడ పని చేస్తున్న మిగతా వారి విశ్వాసం. అందువల్ల అంతరానివారిని వీవర్స్ గా తీసుకోరు. ఇక్కడ కమ్యూనిస్టుల నాయకత్వంలో నడిచే కార్మిక సంఘం ఉంది. వారు గూడా దీన్ని వ్యతిరేకించుట లేదు.ఈ పరిస్థితి చూసి అంబేద్కర్ చాలా బాధపడ్డారు. కమ్యూనిస్టులతో విభేదించి అంటరాని కార్మికులకు కూడా వీవర్స్ గా ప్రమోషన్ వచ్చేదానికి పోరాడి అంగీకరింప చేశారు డాక్టర్ అంబేద్కర్. కార్మికుల ఉద్యమాలు విజయవంతం కావాలంటే ముందుగా శ్రామికుల విభజన నశించాలని ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ అంటారు.
ఈ విషయాన్ని పురస్కరించుకొని డాక్టర్ అంబేద్కర్ ప్రారంభించిన “బహిష్కృత భారతి” పత్రికలో “లెనిన్ కానీ భారతదేశంలో పుట్టి ఉన్నట్లయితే కార్మిక విప్లవ ఆలోచన చేసే కన్నా ముందుగా కార్మికుల విభజనను సృష్టించిన కుల వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నం చేసేవారని” వ్రాసారు.
కార్మికుల కర్షకుల సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు డాక్టర్ అంబేద్కర్.1937 లో జరిగిన ఎన్నికలలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరఫున 17 మంది సభ్యులు పోటీ చేయగా 14 మంది విజయం సాధించారు.
1938 లో పారిశ్రామిక వివాదాల చట్టానికి వ్యతిరేకంగా పోరాడుట
1935 భారత చట్ట ప్రకారం యాజమాన్యం అనుమతి లేకుండా సమ్మె చేస్తే కార్మికులకు ఆరు నెలలు శిక్ష విధించాలని చట్టం చేయాలని ప్రతిపాదించారు. దానిని డాక్టర్ అంబేద్కర్ వ్యతిరేకిస్తూ “ఇది మంచిది కాదు, రక్తదాహంతో కూడుకున్న చట్టమని” విమర్శిస్తారు. “కార్మికులకు సమ్మె హక్కు నిషేధించడం అంటే బానిసత్వాన్ని కోరుకోవడమే” అని అన్నారు. ఇది బానిస వ్యవస్థకు దారితీస్తుందని అన్నారు. “ సమ్మె చేసినందుకు కార్మికులను శిక్షించడం వాళ్లను బానిసలుగా చేయడమేనని” అంబేద్కర్ అన్నారు. “సమ్మె చేయడం నేరపూరితమైన చర్య కాదని” అన్నారు కమ్యూనిస్టులతో కలిసి ఆ బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. బిల్లును చివరకు ఉపసంహరించుకునేట్లుగా చేశారు.
1942- 46 సంవత్సరముల మధ్య డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొంబాయి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సందర్భంగా అనేక కార్మిక చట్టాలు సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చారు. ఆయన గౌరవార్థం జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఈ పెద్ద పదవి తనకేమీ ఆనందాన్ని ఇవ్వలేదని బాధపడతారు. “కార్మిక సభ్యుడిగా కార్మికుల స్థితిని మెరుగు పరచడంలో విఫలమైనట్లయితే తన పదవిని విడిచి పెట్టడానికి మొదట ఉంటానని” డాక్టర్ అంబేద్కర్ అంటారు.
లేబర్ మెంబర్ గా కార్మికుల కోసం అంబేద్కర్ ప్రవేశపెట్టిన చట్టాలు -పథకాలు.
1. 14 గంటలుగా ఉన్న పని కాలాన్ని 8 గంటలకు తగ్గించుట- దీర్ఘకాలం పని చేసే ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులకు జీతంతో కూడిన సెలవు.
2. ఐదు రకాలైన కార్మిక సంక్షేమ నిధులు
1. బొగ్గు గనుల కార్మికులకు 2. ఇనుము కర్మగారముల కార్మికులకు 3. మాంగనీస్ ఓర్ పరిశ్రమ కార్మికులకు 4. మైకాగని కార్మికులకు 5. బీడీ కార్మికులకు సంక్షేమ నిధి సౌకర్యాన్ని కల్పించారు.
వీటిని కార్మికుల విద్య, ఆరోగ్యం, నీటి సదుపాయం, ఇండ్ల నిర్మాణం కొరకు వినియోగించాలి.
3. కార్మిక సమస్యల పరిష్కారం కోసం మొదటగా త్రిపక్ష సమావేశాల విధానం. అప్పటివరకు యాజమాన్యము కార్మికులే వివాదాలలో ఉండేవారు.
4. లేబర్ కమిషనర్ల నియామకం.
5. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం.
6. ఎంప్లాయిస్ స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం.
7. బొగ్గు గనుల కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్.
8. కరువు భత్యం ఓవర్ టైం, క్యాంటీన్ ఫెసిలిటీ.
9. వర్క్ మెన్ కాంపెన్సేషన్ చట్టం
10. కనీస వేతన చట్టం . ఉల్లంఘన చట్టవిరుద్ధం. వేతనాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పునః పరిశీలన.
11. యాజమాన్యం చే కార్మిక సంఘాలకు గుర్తింపు
12. సమాన పనికి సమాన వేతనం.
13. టెక్నికల్ ట్రైనింగ్ విధానం
అంటే నేటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం.
14. కార్మికుల జీతాలు కరువు భత్యం కొరకు కార్మిక గణాంకాల చట్టం.
15. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల స్థాపన.
మహిళా కార్మికుల కొరకు
-మహిళా సంక్షేమ నిధి.
– సమాన పనికి సమాన వేతనం
– ఫ్యాక్టరీలలో బాలింత తల్లుల పసిబిడ్డల కొరకు క్రచ్చస్ ఏర్పాటు.
-మహిళల బాలకార్మికుల రక్షణ చట్టం.
– మైకా బొగ్గు గనులలో భూగర్భంలో చేసే పనులకు మహిళా కార్మికులను నిషేధించారు.
– మహిళా కార్మికుల సంక్షేమం కోసం ప్రసూతి సెలవు.
డాక్టర్ అంబేద్కర్ ప్రసూతి సెలవుల బిల్లును ప్రవేశపెడుతూ ఈ విధంగా అంటారు.
“దేశము జాతి ప్రయోజనం కొరకు గర్భవతులకు ప్రసవానికి ముందు ప్రసవం తరువాత తల్లులకు కొంత విశ్రాంతి కావాలని నేను నమ్ముతున్నాను. ఆ సూత్రం ఆధారంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాను” అని చెప్పారు.




