అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ దాకా అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా ఆ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, గోడౌన్, పరిశ్రమలు,
ఆలయాల్లో మంటలు ఆర్పివేసే పరికరాల వినియోగంపై ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వివరించాలని, అవగాహన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణ యంత్రాలను పరిశీలించాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణపై అందరికీ అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రూపొందించి, కార్యక్రమాలు చేపడుతున్న అగ్నిమాపక శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి వెంకన్న, సిరిసిల్ల, వేములవాడ ఫైర్ ఆఫీసర్లు నరసింహచారి, కమలాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
