*బిజెపి గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి*
బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు
దౌల్తాబాద్: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మెదక్ లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి, అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫూల్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బాటలోనే నడుస్తున్నారని, మరొకసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు తప్పుడు వాగ్దానాలతో ముందుకు వస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నుండి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ కుక్కల్ని, నక్కల్ని పార్టీలోకి చేర్చుకుంటుందని కేసీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా పక్క పార్టీల నుండి ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అనేక అక్రమాలు చేసిందని వాటి ఫలితమే నేడు కటకటల పాలవుతున్నారని విమర్శించారు . బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రాం రెడ్డి జిల్లా కలెక్టర్గా పని చేసినప్పుడు కనీసం ప్రజల సమస్యల పైన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించలేదని, అలాంటి వ్యక్తి ఎంపీ గెలవడానికి పేద విద్యార్థుల విద్య కోసం 100 కోట్లు కేటాయిస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు. గల్లీలో ఏది ఉన్న ఢిల్లీలో మోడీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తనను గెలిపిస్తే మెదక్ ఆత్మ గౌరవాన్ని కాపాడేలా పని చేస్తారని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై బిజెపిని ఓడించాలని కుట్ర చేస్తున్నాయని కానీ మెదక్ పార్లమెంట్ ఎన్నిక ఏకపక్షమేనని ఆయన అన్నారు.
దేశం కోసం బిజెపి నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తో పాటు ఆయా మండలాల బిజెపి అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు…..