దౌల్తాబాద్: గేదెకు నీళ్లు తాపడానికి వెళ్లి కుంటలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సాయిలు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన దౌల్తాబాద్‌కు చెందిన గొల్లదుబ్బయ్య ఆదివారం నీళ్లు తాపడానికి తన గేదెను స్థానిక కొత్త కుంట వద్దకు తీసుకెళ్లాడు. నీళ్లు తాగిన అనంతరం గేదె కుంటలోకి వెళ్ళింది. ఇది గమనించిన దుబ్బయ్య గేదెను బయటకు తీసుకురావడానికి కుంటలోకి వెళ్లి నీళ్లు లోతుగా ఉండడంతో వీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఈ మేరకు మృతుని కొడుకు యాదయ్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్ఓ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు..
