ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ మల్లాపూర్: రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చెరకు నరికే కూలీ కుటుంబంలో గురువారం జరిగిన సంఘటన గుండంపల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాల ప్రకారం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గత కొన్ని రోజులుగా చెరుకు పంటను నరికేందుకు తరలివచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. బుధవారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో రోజువారి లాగానే చెరుకు పంట కట్ చేస్తున్న సమయంలో ఓ తల్లి తన చిన్నారితో కలిసి పొలానికి వెళ్లి లాలించి చెరుకు బోయలో పడుకోబెట్టింది. ఇది గమనించని ట్రాక్టర్ డ్రైవర్ చెరుకు పంటను లోడ్ చేస్తున్న క్రమంలో వెనుక ప్రాంతంలో ఉన్న చిన్నారిని గమనించక తొక్కి వేయడంతో చిన్నారి శరీరం నుజ్జునుజ్జయింది. అకస్మాత్తు ఒక్కసారిగా ట్రాక్టర్ చిన్నారి పైకి ఎక్కడంతో గమనించిన తల్లి గుండెలు పగిలేలా రోధించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
