మహిళా సాధికారతే కేసీఆర్ లక్ష్యం
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
అన్ని రంగాల్లో ముందు నిలపాలనే లక్ష్యంతో సీఏం కేసిఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ విఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో మండల మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో పురుషులతో సమానంగా మహిళలకు కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టం తేవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో మహిళలకు ఇబ్బందులు వచ్చినప్పుడు అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని వాటిని తీర్చలేక అనేక ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. గతంలో స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల రుణం ఇచ్చే వారిని నేడు సీఎం కేసీఆర్ ఆదేశాలతో రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారన్నారు. మహిళల స్వయం సమృద్ధి సాధించడానికి మరింత సహకారాన్ని అందిస్తామన్నారు. సి ఏ లకు జీతం తక్కువగా ఉందని గతంలో జరిగిన సమావేశంలో తన దృష్టికి తీసుకురావడం తో ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు తో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే కెసిఆర్ స్పందించి జీతాలు పెంచడం జరిగిందన్నారు. వడ్డీ లేని రుణాలు త్వరలో విడుదల చేస్తామని మహిళా సంఘాల మహిళలకు బీమా సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. వివో, సీసీ లకు డ్రెస్ కోడ్ కావాలని అడగగా వారికి త్వరలో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ తరహా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని ఎవరు పని చేస్తున్నారో మీరు గుర్తించాలన్నారు. త్వరలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తానని అన్నారు. అనంతరం గోవిందా పూర్, గువ్వలేగి గ్రామలలో వాల్మీకి బోయ, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్ మనోహర్ రావు, ఎపిఎం కిషన్, సీసీలు, సిఏలు తదితరులు పాల్గొన్నారు.