ఒక మహిళను హత్య చేసిన ఘటనలో, రిమాండ్ లో ఉన్న నిందితుడి ఇంటిని బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన కొన్ని మహిళా సంఘాలు, మరి కొంతమంది వ్యక్తులు కలిసి పూర్తిగా ధ్వంసం చేసి, దగ్ధం చేసిన ఘటన దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాలు……. హబ్సిపూర్ గ్రామానికి చెందిన బైండ్ల బాలవ్వ (52) అనే ఒక మహిళను గత నెల సెప్టెంబర్ ఆరవ తేదీన అదే గ్రామానికి చెందిన ఇంటి సమీపంలో ఉండే మద్దెల నవీన్ అనే యువకుడు హత్య చేసినట్లు, పోలీసులకు ఆధారాలు లభించడంతో ప్రధాన నిందితుడైన నవీన్ తో పాటు అతని తల్లి చంద్రవ్వను గత నెల 19న పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో మహిళను హత్య చేసిన నిందితుడి ఇంటిని మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని పలు మహిళా సంఘాలు తాళం వేసిన నిందితుడి ఇంటిలోకి చొరబడి, ఇంటి గోడలను, ఇంటి అద్దాలను, సెల్పులను, ఇంట్లోని సామాన్లను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమై, దగ్ధమైంది. వెంటనే సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారంతో దగ్ధమవుతున్న ఇంటికి చేరుకొని, మంటలను ఆర్పారు ఘటనా స్థలాన్ని సిద్దిపేట ఏసిపి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటిని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయనున్నట్లు దుబ్బాక సీఐ తెలిపారు.




