నిజామాబాద్ అక్టోబర్ 1:ఎస్టీ సబ్ ప్లాన్ కు 90 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
గిరిజన రిజర్వేషన్ల పెంపుతో విద్య ఉపాధిలో అనేక అవకాశాలు, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 90 పాఠశాలలు, 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 198 పాఠశాలలు.
తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్.
నిజామాబాద్ లో బంజారా భవన్ శంకుస్థాపన కార్యక్రమం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 90 వేల కోట్లు కేటాయించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం ద్వారా గిరిజన బిడ్డలకు విద్యా, ఉపాధిలో అదనపు అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన గిరిజనులకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని చెప్పారు. అయినా కూడా తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదన్నది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లు వేచిచూసి ఇక ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని స్పష్టం చేశారు. తద్వారా గిరిజనులకు విద్యలో, ఉపాధిలో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. రిజర్వేషన్ పెంచిన తర్వాత దాదాపు 3985 మంది గిరిజన బిడ్డలకు అదనంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయని, 195 మందికి మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు లభించాయని వివరించారు. సమాజానికి మంచి జరగాలన్న ఉద్ధేశంతోనే సీఎం కేసీఆర్ రిజర్వేషన్లను పెంచారని, రాజకీయం కోసం కాదన్నది ఈ లెక్కలు నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు. నిర్ణయం వల్ల గిరిజనుల తరతరాల్లో మార్పు వస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.