*తాను అవినీతి కి పాల్పడినట్టు నిరూపిస్తారా…
తడిబట్టలతో అమ్మవారి గుడిమెట్ల ఎక్కుదాం
తప్పు చేసినట్లు నిరూపిస్తే రాందాస్ చౌరస్తా లో ముక్కునేలకు రాస్తా..
ప్రతిపక్షాలకు ఇఫ్కో డైరెక్టర్ యం.దేవేందర్ రెడ్డి సవాల్
కాంగ్రెస్ బిజెపి నాయకులు తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డట్లు నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే తాను వేసే సవాలును స్వీకరించాలని ఇఫ్కో డైరెక్టర్, బారాస నాయకులు యం. దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు అడ్డాగా మారిందని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో
పార్టీ బలంగా మారుతుందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారికి టికెట్ కేటాయించినట్లు చెప్పారు.బీఆర్ఎస్ లో టికెట్లు ఆశించి బంగపడ్డ వారు తనపై విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పద్మ దేవేందర్ రెడ్డి పనితనాన్ని మెచ్చి మరోసారి అభ్యర్థి గా ప్రకటించడంతో ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదన్నారు.ఏడుపాయల విషయంలో ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, దేవన్న పేరు తీసుకున్నంత మాత్రాన తప్పు చేసినట్లేనా అని ప్రశ్నించారు.
గతంలో ఏడుపాయల ఆదాయం 1.30 కోట్ల ఆదాయం ఉండదని, అక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రస్తుతం రూ.8 కోట్ల కు చేరుకుందని చెప్పారు. ఏడుపాయల ఘటన పై అధికారులు నిక్షిప్తపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేయలేదని అమ్మవారి సన్నిధిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారి ఆలయంలోకి వెళ్తున్నాను. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపించే దమ్ము, ధైర్యం ఉన్న నాయకులు తడి బట్టలతో ఆలయంలోకి వస్తారని ప్రశ్నించారు.
నాపై ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగిన నాయకుల్లో ఏడుపాయల చైర్మన్ పదవి చేసినోళ్లు కూడా ఉన్నారని, వారు ఏడుపాయలను ఎంతవరకు అభివృద్ధి చేశారని అన్నారు. ఏడుపాయల వన దుర్గ మాత మిశ్రమ బంగారం, వెండి కానుకలను 20 ఏళ్ళల్లో వారు ఎందుకు లెక్క తేల్చలేదని ప్రశ్నించారు. ఆలయ ఈవో అవినీతి చేస్తే అధికారులు విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటారన్నారు.
ఆలయ బంగారం, వెండి విషయం తనకు, పాలకవర్గానికి 10:25 నిమిషాల దాకా నాకు తెలియదని చెప్పారు. దేవన్న అన్నంతా మాత్రాన తప్పు చేసినట్లేనా? తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. వ్యక్తిగత క్యారెక్టర్ పై ఆరోపణలు చేస్తే బాధ కలుగుతుందని, ఇలాంటి ఆరోపణలు చేస్తే న్యాయవాదిగా వారిపై కోర్టుకు వెళ్ళవలసి ఉంటుందన్నారు.
ఆలయ పాలక మండలి తో కలిసి అసిస్టెంట్ కమిషనర్ కావాలని తీర్మానం చేశామని,చట్టం తనపని తాను చేసుకుంటుందన్నారు. అక్రమాలకు పాల్పడితే ఆలయ ఈఓ ను సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు.
మీడియా అవినీతి అక్రమాలను బాధ్యతగా బయటకు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాల గౌడ్, నిజాంపేట్ ఎంపీపీ దిశెట్టి.సిద్ధిరాములు, హవేళిఘనాపూర్ నిజాంపేట మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.