– మూడు నెలల క్రితం 55 లక్షలకు ఒప్పందం
దౌల్తాబాద్: డబ్బులు కట్టాలన్న మనస్థాపంతో వీఆర్ఏ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన మస్కూరి నగేష్ (42) అసల్దారు వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం అసల్దారు వీఆర్ఏలను పర్మినెంట్ చేయడంతో ఆయనకు వ్యవసాయ శాఖలో సబర్డినేటుగా ఉద్యోగం వచ్చింది. అంతకుముందే వాటాదారులకు రూ. 55 లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. డబ్బులు చెల్లించనట్లయితే భూమిని రాసి ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ డబ్బులు ఎక్కడా సర్దుబాటు కాలేక వాయిదా రావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈనెల 24న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నగేష్ కోసం వెతుకుతుండగా 25 న ఉదయం గ్రామ శివారులో పురుగుల మందు తాగి పడిపోయి కనిపించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు మృతుని భార్య మంజుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.