పెద్దలింగాపూర్ లో ఎమ్మెల్యే రసమయి కి రైతుల సెగ
ప్రజాపక్షం/ఇల్లంతకుంట (రిపోర్టర్ దేవేండేర్)
స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు రైతుల నుండి గురువారం నిరసన సెగ తగిలింది. కార్యక్రమంలో భాగంగా మండలములోని పెద్దలింగాపూర్ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా వద్ద స్థానిక రైతులు ఎమ్మెల్యే ను అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.కష్టపడి పండించిన పంటను కొనే నాధుడు లేడని ప్రశ్నించారు.కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి రవాణా వ్యవస్థ సరిగా లేదని,లారీలు రాక పోవడముతో తూకం వేసిన ధాన్యం కల్లాలోనే నిల్వ ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు.ఎమ్మెల్యే వెంట ఉన్న స్థానిక నాయకున్నీ రైతులు నిలదీశారు. తమ స్వంత గ్రామములో ధాన్యం వెంట వెంట ఎలా తూకం వేసి మిల్లులకు తరలిస్తున్నారని ప్రశ్నించారు.దీనికి స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ధాన్యం తరలింపులో స్థానిక సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపాలని కాంగ్రేస్ మండల అధ్యక్షుడు వెంకట్ సర్పంచ్ కాళ్లపై పడి వేడుకున్నారు.ఏది ఏమైనా మండల రైతుల కష్టాలు తీర్చే నాయకులు కరువయ్యారని రైతులు వాపోతున్నారు.
