ప్రాంతీయం

గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. తోటధర్మేందర్…

360 Views

● బొగ్గుబాయి బొంబాయి దుబాయి నినాదాన్ని మర్చిపోయారు

ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి  గత 52 సంవత్సరాలుగా… 1970 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నీళ్లు – నిధులు – నియామకాలు &  బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజువర్మ, అన్నారు. గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత – ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం (13.06.2023) గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో అఖిలపక్ష చర్చా సమావేశంలో రవీంద్రరాజువర్మ ప్రసంగించారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు.

తెలంగాణలో పేదరికం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం, ప్రకృతి వైపరీత్యాలు, అణచివేసే చట్టాలు, అధిక పన్నుల భారం లాంటి నెట్టివేయబడే కారణాల వలన కార్మికులు గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారని గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ రెడ్డి అన్నారు.  అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవితం కోసం కూడా గల్ఫ్ వలసలకు కారణం అని ఆయన అన్నారు.

గల్ఫ్ తో సహా 18 ఈసీ ఎన్నార్ (ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డు) దేశాలలో 88 లక్షల  మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల  మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన కార్మికులు 15 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా. గత పదేళ్లలో 15 లక్షల మంది వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్నట్లు అంచనా. తెలంగాణలో వలసలకు సంబంధించిన అధ్యయనం ఏదీ ఇప్పటివరకు చేయలేదు. గణాంకాలు కూడా అందుబాటులోకి లేవు. లభ్యమయ్యే గణాంకాలు అంచనాలు మాత్రమే. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస  వెళుతున్న వారిలో పురుషులు 99%, స్త్రీలు 1% ఉన్నట్లు అంచనా. గల్ఫ్ దేశాలకు ఉద్యోగ నియామకం కొరకు లైసెన్స్ కలిగిన రిక్రూటింగ్ ఏజెన్సీలు భారతదేశంలో 1,919 ఉన్నాయి. తెలంగాణలో 102 ఉన్నాయి. వేలాది మంది సబ్ ఏజెంట్లు, అనధికార ఏజెంట్లు కూడా ఉన్నారని గల్ఫ్ జెఏసి ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ప్రతినెలా 1,500 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు. ఈ విధంగా ఏడాదికి 18 వేల కోట్ల రూపాయల చొప్పున గత ఎనిమిదిన్నర ఏళ్లలో… ఒక లక్ష 53 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు చేరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడింది. ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గత ఎనిమిదిన్నర ఏళ్లలో 15 వేల 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2021-22 ఆర్థిక సం.లో వివిధ దేశాల నుండి భారత్ కు 89 బిలియన్ యూఎస్ డాలర్ల (73.5 లక్షల కోట్ల రూపాయలు) విదేశీ మారకం వచ్చిందని భారతీయ మజ్దూర్ సంఘ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ అన్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు తగిన బడ్జెట్ కేటాయించాలని ఆయన కోరారు.

7 డిసెంబర్ 2018 నాడు తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నాలుగు నెలల తర్వాత 11 ఏప్రిల్ 2019 నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా వ్యతిరేకమైన తీర్పునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ  ముగ్గురు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీలు ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు కూడా ఒక కారణం అని గల్ఫ్ జెఏసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పట్కూరి తిరుపతి రెడ్డి అన్నారు.

కరోనా కష్ట కాలంలో.. వందే భారత్ మిషన్ ఫ్లయిట్స్ లో రెండింతల చార్జీలు, ఛార్టర్ ఫ్లయిట్స్ లో మూడింతల చార్జీలు వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వంపై గల్ఫ్ కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. కరోనా సమయంలో కేరళ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ సంఖ్యలో విమానాలను నడిపిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ కు తక్కువ విమానాలను నడిపినప్పుడు బీజేపీ ఎంపీలు పెద్దగా పట్టించుకోలేదని  గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్  అన్నారు.

కరోనా సమయంలో చార్టర్ ఫ్లయిట్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాండింగ్ పర్మిషన్ ఇవ్వడంలో జాప్యం చేయడం కూడా సమస్య మరింత జటిలం అయ్యింది. కొద్ది రోజులు మాత్రమే ఉచిత క్వారంటైన్ వసతి కల్పించి, తర్వాత హోటల్ క్వారంటయిన్ ఛార్జీలతో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఇబ్బందులకు గురి చేసింది. అధిక విమాన ఛార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడు అయి కార్మికులు అప్పులపాలు అయ్యారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా ‘హోం క్వారంటైన్’ కు అనుమతి ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు హోటల్ క్వారంటైన్ తోపాటు, పేదలకు ఉచిత క్వారంటైన్ కూడా ఇచ్చాయని బీఎమ్మెస్  నాయకుడు తోట ధర్మేంద్ర అన్నారు.

కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ గా ఉన్న కాలంలో… 12 జూన్ 2015 నాడు బహరేన్ దేశంలో కార్మిక క్యాంపులను సందర్శించి, అక్కడ కార్మికులతో సహపంక్తి భోజనం చేసిన సందర్భంగా ‘గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం’ అని అన్నారు. తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలో గల్ఫ్ తో కలుపుకొంటే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు అని గల్ఫ్ కు ఉన్న ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. కానీ ఆచరణలో చేసింది శూన్యం అని బీజేపీ నాయకురాలు తుల ఉమ అన్నారు.

అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పలు డిమాండ్లు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్లు

◉ సమగ్ర ఎన్నారై పాలసీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి. అమాయకులైన వలస కార్మికుల రక్షణకు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలతో సహా 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించిన 1983 లోని ఎమిగ్రేషన్ చట్టం యొక్క ప్రాతిపదిక ప్రకారం… ‘గల్ఫ్ బోర్డు’ ఏర్పాటు చేయాలని మేధావుల బృందం సూచించింది.

◉  గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

◉ రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించొద్దు. అన్ని విద్యా సంస్థలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి.

◉ జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి.

◉ గల్ఫ్ కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ధరణి పోర్టల్ వలన గల్ఫ్ దేశాలకు వెళ్లిన రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

◉ మానవ అక్రమ రవాణాను అరికట్టాలి. రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి. ఏజెంట్లను నియంత్రించాలి.

కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్లు

◉ హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

◉ ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలి. పాస్ పోర్ట్ స్టేటస్ తో సంబంధం లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలి.

◉ ఎమిగ్రేషన్ యాక్టు-1983 ప్రకారం… గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్ చార్జీగా అభ్యర్థి యొక్క 45 రోజుల వేతనం (రూ. 30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ అనగా రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని పూర్తిగా రద్దు చేయాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్లు

◉ విదేశాల నుండి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికుల నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలి.

◉ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలి.

◉ కరోనా సందర్భంగా గల్ఫ్ తదితర దేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన  జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్,  గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం వారి హక్కు. బాధితుల పక్షాన ప్రభుత్వాలు నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *