ఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఈ రుతుప్రేమ ద్వారా లభిస్తుంది. రుతుప్రేమ గురించి బహిరంగంగా మాట్లాడటంలో తప్పేమీ లేదు. అవగాహన కల్పించడంతో మహిళల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సిద్ధిపేట మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులను భాగస్వామ్యం చేసుకుని మరింత ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రుతుప్రేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
రుతుప్రేమ కార్యక్రమం గురించి మీకు అవగాహన కల్పించి మీ విలువైన సలహాలు, సూచనలతో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు మీ భాగస్వామ్యం, సహకారం అందించాలని మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
తడి చెత్త బుస్సాపూర్, పొడి చెత్త మిడిల్ ట్రాన్స్ పోర్ట్, హానికరమైన చెత్తలో ఓ భాగం ఇన్సినరేటర్ ద్వారా దహనం, మరో భాగం రావొద్దనే ఈ రుతుప్రేమ. కిలో చెత్త కూడా మిగలకుండా డంప్ యార్డులేని పట్టణంగా సిద్ధిపేట ప్రపంచ పటంలో నిలవబోతున్నది. ఆ దిశగా అడుగులు వేశాం. ఇది నిరంతర ప్రక్రియగా ఇలా మేమంతా చెత్తబండి వెంట తిరిగి చెత్తపై ఐదేళ్లు చేసిన ప్రయత్నంతో సిద్ధిపేట ప్రజలు చైతన్యవంతులు, గొప్పవారవడంతో 95 శాతం సక్సెస్ అయ్యాం. మిగిలిన 5 శాతం కూడా సక్సెస్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఫలించేలా మీ భాగస్వామ్యం, సహకారాన్ని అందించాలని డాక్టర్లు, గైనకాలజిస్టులను మంత్రి హరీశ్ రావు కోరారు.
సిద్ధిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో వైద్యులు, గైనకాలజిస్టు నిపుణులకు బుధవారం రాత్రి మంత్రి, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు సమక్షంలో రుతుప్రేమ అవగాహన సదస్సు జరిగింది. ఈ మేరకు జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, పోలీసు కమిషనర్ శ్వేత, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి, డాక్టర్ మీనాక్షిలు రుతుప్రేమ పై పట్టణానికి చెందిన ప్రముఖ మహిళా వైద్యులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తున్న క్రమంలో హానికరమైన చెత్త ద్వారా కలిగే అనర్థాలపై సమరం చేసేలా మొదలైన మా ప్రయాణంలో ఈ రుతుప్రేమ ఆలోచన వచ్చిందని తెలిపారు.
ఆరోగ్య, పరిశుభ్రమైన సమాజం కోసం అడుగులు వేయాలని, సిద్ధిపేటలో నిత్యం 30 టన్నుల పైచిలుకు చెత్త ఉత్పత్తి అవుతున్న దృష్ట్యా, ఈ చెత్తపై దృష్టి సారించకపోతే డంప్ యార్డులో కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసనతో ఆ పరిసర ప్రాంత ప్రజలు సమాజానికే విపత్తు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతున్నదని, కాల్చిన చెత్తతో కలుషిత గ్యాస్, వర్షం కురిసి భూగర్భజలాలు కలుషిత మవుతున్నాయని, దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉన్నదని, ప్రజల చేతుల్లోనే ఉన్నదని, ప్రజలను చైతన్య వంతం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని సవివరంగా మహిళా వైద్యులకు మంత్రి అవగాహన కల్పించారు.
సిద్ధిపేటలో బ్లాక్ స్పాట్ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామని, డంప్ యార్డు లేని ప్రదేశంగా ప్రపంచ పటంలో నిలిపేలా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
రుతుచక్రం లేనిదే మనిషి జీవన చక్రం లేదని, రుతు చక్రంలో శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల రీసైకిల్ అవ్వక పోవడం వల్ల పర్యావరణానికి వచ్చిన నష్టాన్ని పరిష్కరించేలా సిద్దిపేట దేశానికే ఒక మోడల్ గా నిలుస్తున్నదని తెలిపారు.
శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల మహిళల ఆరోగ్యం పాడవటం, పర్యావరణానికి నష్టం జరుగుతున్న దృష్ట్యా దీన్ని నిర్ములించేలా మెన్స్ట్రువల్ కప్స్ వాడకం పై అవగాహన కల్పిస్తూ వస్తున్నామని, దీనివల్ల మహిళలకు ఎంతో అనుకూలం, అలాగే పర్యావరణానికి కలిగే లాభాలను వివరిస్తూ.. ఇప్పటికే లక్షలమంది మహిళలను చైతన్యపర్చి శుద్ధిపేట నియోజకవర్గంలో ఈ రుతుప్రేమను విజయవంతం చేసిన డాక్టర్ శాంతి, పోలీస్ కమిషనర్ శ్వేత, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, డీపీఓ దేవకి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ లను అభినందించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో సిద్దిపేట మహిళా డాక్టర్లు గైనకాలజిస్ట్లు భాగస్వామ్యంతో కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
రుతుప్రేమ కార్యక్రమం గురించి మీకు అవగాహన కల్పించి మీ విలువైన సలహాలు, సూచనలతో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు మీ భాగస్వామ్యం, సహకారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
సిద్ధిపేట ప్రజలు ఎంతో గొప్పవారని, వారి భాగస్వామ్యంతో సిద్ధిపేటలో 95% చెత్త వేర్వేరుగా చేసి ఇవ్వడంతో దేశంలోని పారిశుద్ధ్య నగరాల్లో మన సిద్ధిపేట అగ్రస్థానంలో నిలిచిందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు తప్పేలా సిద్ధిపేటలో ప్రారంభమైన ఈ మహాత్తర కార్యక్రమం రాష్ట్రం, దేశమంతా విస్తరించి పర్యావరణ సంరక్షణకు మనం మన సిద్ధిపేట ఆదర్శంగా నిలుద్దామని కోరారు.
ఈ మేరకు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప కార్యక్రమం సిద్ధిపేటలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యనే ఉంటూ బయటకు చెప్పుకోలేని ఇలాంటి సమస్యల గురించి సమావేశమై పరిష్కరించాలని చర్చించడమే ఎంతో గొప్ప విజయంగా భావిస్తున్నట్లు సీపీ శ్వేత చెప్పారు. ఎందుకంటే స్త్రీ ఆరోగ్యంతో పాటు అమ్మలాంటి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత కూడా మన అందరిపై ఉన్నదని గుర్తు చేశారు. మెన్స్ట్రువల్ కప్స్ వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు నిర్మూలించవచ్చునని, మీ ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడాలని సీపీ శ్వేత కోరారు. కాగా ప్రముఖ వైద్యులు రమాదేవి, గాయత్రి, సుగుణ, అరుణ, సుహాసినిలు రుతుప్రేమ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మేము సైతం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు రుతుప్రేమ ప్రారంభమై రెండేళ్లు పూర్తయ్యిన సందర్భంగా కార్యక్రమంలో భాగస్వామ్యమై కృషి చేసిన సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్-భార్య కోసం, డీపీఓ దేవకి, డాక్టర్ శాంతి, డాక్టర్ మీనాక్షిలకు సిద్ధిపేట ప్రఖ్యాతిగాంచిన గొల్లభామ చీరలను బహుకరించారు.




