అధికారులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితోనే గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు. కోనరావుపేట మండల పరిషత్ కార్యలయంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తే మన మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతులు వరికి బదులుగా లాభసాటి అయిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. వ్యవసాయాధికారులు రైతులకు పంట మార్పిడి పై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్యలు ఉన్న గ్రామాలలో సమస్యలపై సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో గిరిజన రైతులు వారి యొక్క పోడు భూముల సమస్యలను ప్రభుత్వానికి తెలుపాలని కోరారు. ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. మండలంలో పాఠశాలలకు మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని, పాఠశాలలో మౌలిక సదుపాయాలకు ఒక సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు నిధులు వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజారోగ్య విషయానికి వస్తే, మన రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీల సర్పంచులు మరియు ఎంపిటీసిలు లెవనెత్తిన పలు సమస్యలను ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి మరియు మన జిల్లా మంత్రివర్యలు కేటీ రామారావు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. అనంతరం కోనరావుపేట మండల పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయించవలసిందిగా చైర్ పర్సన్ కు విలేకరులు వినతి పత్రం అందచేశారు. ఈ సమావేశంలో వైస్ ఎంపిపి సుమలత శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు బండ నరసయ్య, రామ్మోహన్ రావు, ఎంపిడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
