Breaking News

రాజ్యాంగ నిర్మాణం.

1,347 Views

మండల్ వర్గల్ మజీద్ పల్లి గ్రామంలో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా  గ్రామ ప్రజలు, యువకులు, గ్రామ సర్పంచ్, ఎంపీపీ లతా రమేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు. భారత రాజ్యాంగం నిర్మించబడిన తీరు:

రాజ్యాంగాన్ని నిర్మించడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు.

రా జ్యాంగాన్ని చేత్తో కాగితాలపై రాసింది ఎవరు?
భారత రాజ్యాంగాన్ని చేత్తో రాసిన వ్యక్తి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా (1901-1966). ఆయన ప్రఖ్యాతి గాంచిన కాలిగ్రాఫర్.దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకున్న రైజాదా ఇంగ్లిష్, పెర్షియన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. రాజ్యాంగం కాపీ రాయమని నెహ్రూ రైజాదాను ఆహ్వానించారు. అది రాయడానికి మీకేం కావాలని నెహ్రూ అడిగితే, “నాకేమీ వద్దు కానీ, రాజ్యాంగంలోని ప్రతి పేజీ మీద నా పేరు రాసుకుంటానని, చివరి పేజీలో నా పేరుతో పాటు మా తాత పేరు కూడా రాస్తానని” చెప్పారట. నెహ్రూ అందుకు అంగీకరించగా. రైజాదా రాజ్యాంగాన్ని ఇంగ్లిష్‌లో ఇటాలిక్ స్టైల్‌లో రాశారు. అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ సహా 251 పేజీల రాజ్యాంగాన్ని రాయడానికి రైజాదాకు ఆరు నెలలు పట్టింది..

1.బీఆర్ అంబేడ్కర్ – చైర్మన్.

భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధికెక్కిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త.
స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రి.అంబేడ్కర్ 1891లో మధ్యప్రదేశ్‌లో జన్మించారు. 1907లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. ఆ తరువాత ఏడాది ముంబయిలోని ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరారు. ఆ కళాశాలలో చేరిన తొలి దళిత విద్యార్థి అంబేడ్కరే.
1912లో బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. తరువాత బరోడా రాజ్యంలో ప్రభుత్వం ఉద్యోగం పొందారు.
1913లో అమెరికాలోని కొలంబియా యునివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు.
1923లో బొంబాయి(ముంబై)లో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. 1927లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1947లో మొదటి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.రాజ్యాంగ సభ చర్చల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగం ముసాయిదాలోని చేర్చవలసిన అంశాలపై ఆయన బలంగా వాదించారు. ముఖ్యంగా ఆర్టికల్ 32పై దృష్టి పెట్టారు. భారత రాజ్యాంగాంలోని ఆర్టికల్ 32 పౌర హక్కుల గురించి చెబుతుంది. దీని ప్రకారం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని పౌరులు భావిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
“భారత రాజ్యంగాంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని అడిగితే, ‘ఆర్టికల్ 32’ అని చెబుతాను. అది లేకుండా ఈ రాజ్యాంగం శూన్యం అవుతుంది. రాజ్యాంగంలో ఇంత కీలకమైన ఆర్టికల్ మరొకటి లేదు. ఇది రాజ్యాంగం ఆత్మ, హృదయం వంటిది. రాజ్యాంగ సభ కూడా దీని ప్రాముఖ్యాన్ని గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నాను” అని అంబేడ్కర్ 1948, డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో చెప్పారు.
అంబేడ్కర్ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారు. వ్యవస్థలో అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు కృషి చేశారు. ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ఫలితాలను నేడు మనం పొందుతున్నాం. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండాలన్నదే అంబేడ్కర్ సిద్ధాంతం.
“రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగాలంటే, సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా ఉండాలి. సామాజిక ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించే జీవన విధానం” అని అంబేడ్కర్ చెప్పారు.భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతాలు కీలక పాత్ర పొషించాయని ఆర్థిక నిపుణులు చెబుతారు.

2.అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.

డ్రాఫ్టింగ్ కమిటీలో ప్రధాన సభ్యుడు అయిన కృష్ణస్వామి అయ్యర్ ఒక న్యాయవాది. 1929 నుంచి 1944 వరకు మద్రాస్ స్టేట్‌కు అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరించారు. తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ 1883లో నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్‌లో ఉండేది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చరిత్ర చదువుకున్నారు. లా చదివి న్యాయవాద వృత్తి చేపట్టారు.
బ్రిటిష్ ప్రభుత్వం కృష్ణస్వామి అయ్యర్‌కు 1930లో దివాన్ బహదూర్ బిరుదును, 1932లో సర్ బిరుదును అందించింది. కృష్ణస్వామి అయ్యర్ డ్రాఫ్టింగ్ కమిటీలోనే కాక రాజ్యాంగ సభకు సంబంధించిన ఇతర కమిటీల్లో కూడా సభ్యుడిగా ఉన్నారు.
వివిధ దేశాల రాజ్యాంగల గురించి, భారతదేశ న్యాయవ్యవస్థ గురించి కృష్ణస్వామి అయ్యర్‌కు అపారమైన జ్ఞానం ఉందని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు.
“నా కన్నా మెరుగైన, సమర్థవంతులైన వ్యక్తులు.. నా స్నేహితుడైన కృష్ణస్వామి అయ్యర్ లాంటి వాళ్లు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు” అని అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ ముగింపు ప్రసంగంలో ప్రస్తావించారు.
రాజ్యాంగంలో ఉండాల్సిన పౌర హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు కృష్ణస్వామి అయ్యర్. “పౌరసత్వానికి హక్కులు, బాధ్యతలు కూడా ఉంటాయని” ఆర్టికల్ 5 మీద జరిగిన చర్చ సందర్భంగాా ఆయన నొక్కిచెప్పారు.
లౌకికరాజ్య స్థాపన గురించి మాట్లాడుతూ, “మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మత లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య బేధాలు చూపకూడదు” అని స్పష్టపరిచారు.
అయితే, వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల కన్నా దేశ రక్షణకు పెద్దపీట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
“దేశంలో శాంతి, సుస్థిరత ఉంటేనే భావప్రకటనా స్వేచ్ఛ, ప్రభుత్వం ఏర్పరుచుకునే హక్కు, ఇతర హక్కుల వంటివి వర్థిల్లుతాయి. దేశానికి భద్రత లేకపోతే ఈ హక్కులు అమలుకావు” అని ఆయన అన్నారు. రాజ్యాంగం ఆమోదం పొంది, రాజ్యాంగ సభ ముగిసిన తరువాత అయ్యర్ మళ్లీ న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1953లో కన్నుమూశారు.

3.ఎన్ గోపాలస్వామి అయ్యంగార్.

నరసింహ గోపాలస్వామి అయ్యంగార్..
రాజ్యాంగంలో ఆర్టికల్ 370 రాసింది ఈయనే. జమ్మూ-కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రూపకల్పన చేయడానికి అంబేడ్కర్ నిరాకరించడంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ బాధ్యతను గోపాలస్వామి అయ్యంగార్‌కు అప్పగించారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని తంజావూరు జిల్లాలో 1882లో గోపాలస్వామి అయ్యంగార్ జన్మించారు. ప్రెసిడెన్సీ కాలేజీ, మద్రాస్ లా కాలేజీల్లో చదువుకున్నారు.
అయ్యంగార్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్‌గా పనిచేశారు. దివాన్ బహదూర్, సర్ బిరుదులు అందుకున్నారు.
1905లో ఆయన మద్రాస్ సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. 1919 వరకు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. 1920లో జిల్లా కలెక్టర్, జిల్లా మెజిట్రేట్ అయ్యారు. 1930 నుంచి మూడేళ్ల పాటు అనంతపూర్ జిల్లా కలక్టర్‌గా వ్యవహరించారు. 1937లో కశ్మీర్ ప్రధానమంత్రిగానియమితులయ్యారు. 1943 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. స్వతంత్రం వచ్చిన తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పోర్టుఫోలియో లేని మంత్రిగా ఒక ఏడాదిపాటు ఉన్నారు. అప్పుడు భారత్ తరఫున కశ్మీర్ వ్యవహారాలను చూసుకునేవారు.
తరువాత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇది ముగిసిన తరువాత 1948 నుంచి 1952 వరకు రైల్వే, రవాణా శాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్‌లో పనిచేశారు. భారతీయ రైల్వేను ఆరు జోన్లుగా విభజించాలన్నది ఆయన ఆలోచనే. 1952-53లో రక్షణ మంత్రిగా పనిచేశారు.
రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఆర్టికల్ 370నురూపొందించినప్పుడు,
దాన్ని రాజ్యాంగ సభలో బలపరిచే బాధ్యతను కూడా గోపాలస్వామికే అప్పగించారు నెహ్రూ.
తదనంతర కాలంలో కశ్మీర్ వివాదంలో ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి బృందానికి గోపాలస్వామి ప్రాతినిధ్యం వహించారు. 1949లో గోపాలస్వామి అయ్యంగార్ రాసిన ‘రికగ్నైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మిషనరీ అనే రిపోర్ట్’.. రక్షణ కమిటీ, ఆర్థిక కమిటీ, పార్లమెంటరీ, న్యాయ వ్యవహారాల కమిటీ, కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది.
1953లో గోపాలస్వామి అయ్యంగార్ మృతిచెందారు.

4.కేఎం మున్షీ.

కన్నయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షీ న్యాయవాది, రచయిత, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ అనే కలం పేరుతో పలు రచనలు చేశారు.
‘భారతీయ విద్యా భవన్’ స్థాపించింది ఈయనే. 1938లో గాంధీ సహాయంతో దీన్ని ప్రారంభించారు.
మున్షీ 1887లో గుజరాత్‌లో జన్మించారు. బరోడా కాలేజీలో చదువుకున్నారు. 1907లో ముంబై వెళ్లి లా పూర్తిచేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ పలు చారిత్రక నవలలు రచించారు.
1916లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు. స్వతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు.
స్వతంత్రానంతరం, రాజ్యాంగం ముసాయిదా కమిటీ లోనే కాక, రాజ్యాంగ సభకు చెందిన పలు కమిటీల్లో సభ్యుడు కూడా.
రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు.
అనంతరం, 1953 వరకు వ్యవసాయ, ఆహార మంత్రిగా సేవలు అందించారు.
వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడే, దేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ‘వన్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని రూపొందించారు. నేటికీ ఈ కార్యకరమం కొనసాగుతోంది.
1971లో తన 83 ఏట కన్నుమూశారు.

5.మహ్మద్ సాదుల్లా.

సయ్యద్ మహ్మద్ సాదుల్లా న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు.1885లో అస్సాంలోని గౌహతిలో జనించారు. గౌహతిలోని కాటన్ కాలేజీ, కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. 1910లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
1928లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సర్ బిరుదు అందుకున్నారు.
1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 1938లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి డ్రాఫ్టింగ్ కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు సాదుల్లా. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా.
అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1955లో స్వస్థలం గౌహతిలో చనిపోయారు.

6.బీఎల్ మిట్టర్.

పశ్చిమ బెంగాల్‌కి చెందిన బీఎల్ మిట్టర్ బరోడా దివాన్‌గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో ప్రిన్స్‌లీ స్టేట్స్ విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు.
అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయడంతోఎన్ మాధవరావు ఆయన స్థానంలో డ్రాఫ్టింగ్ కమిటీలోకి వచ్చారు.

7.ఎన్ మాధవరావు.

న్యాయపతి మాధవరావు మైసూర్ దివాన్‌గా పనిచేశారు. మైసూర్ సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. తుంకూర్ జిల్లాకు అస్సిస్టంట్ కమిషనర్‌గా వ్యవహరించారు. తరువాత, మైసూర్ సంస్థానానికి చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. అనంతరం మైసూర్ దివాన్ పదవి పొందారు. మాధవరావు లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. రాజ్యాంగంలో గ్రామ పంచాయితీలు, సమాఖ్య విధానానికి సంబంధించిన అంశాలపై పనిచేశారు.

8.డీపీ ఖైతాన్.

దేవి ప్రసాద్ ఖైతాన్ న్యాయవాది, రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో లా చదువుకున్నారు.
‘ఖైతాన్ & కో’ లా ఫర్మ్ వ్యవస్థాపకులు. ఇది భారతదేశంలోని పురాతన ప్రైవేటు న్యాయ సంస్థల్లో ఒకటి. 1911లో తన సోదరులతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. అంతేకాదు, 1925లో ఏర్పడిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు కూడా.
డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడిగా కొద్దికాలం రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్నారు.
1948లో ఖైతాన్ మరణించడంతో టీటీ కృష్ణమాచారి ఆయన స్థానాన్ని భర్తీ చేశారు.

9.టీటీ కృష్ణమాచారి.

తిరువల్లూర్ తట్టై కృష్ణమాచారి 1899లో మద్రాస్‌లో జన్మిచారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. 1937లో మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, 1942లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ రచనలో భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. 1956 నుంచి 1958 వరకు, 1965 నుంచి 1966 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కీలకమైన పన్ను సంస్కరణలను ప్రవేశపెట్టారు. 1955-1957 మధ్య కేంద్ర ప్రభుత్వంలో ఇనుము, ఉక్కు మంత్రిగా వ్యవహరించారు.
1956లో నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్ప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (NCAER)ను దిల్లీలో స్థాపించారు. ఇదే దేశంలో తొలి స్వతంత్ర ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్.
ఐడీబీఐ, యూటీఐ వంటి ఆర్థిక సంస్థల ఏర్పాటులో కృష్ణమాచారి కీలక పాత్ర పోషించారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *