2021-23 కాలానికి సంబంధించి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి ఈ నెల 18 వ తేదీ వరకు గడువు ఉందని, అలాగే 20 వ తేదీన జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని సిరిసిల్ల ఎక్సైజ్ సీఐ ఎంపీఆర్. చంద్రశేఖర్ వెల్లడించారు.
మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించి నూతన పాలసీ విధివిధానాలపై మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 7 కొత్త మద్యం దుకాణాలు మంజూరు అయినట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణం-2, వేములవాడ పట్టణం-1. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి-1, గంభీరావుపేట మండలం-1, కోనరావుపేట మండలం నిమ్మపెల్లి -1, తంగళ్ళపల్లి మండలం సారంపల్లి-1 కొత్తగా మంజూరు అయ్యాయని, దీంతో జిల్లాలో మొత్తం మద్యం దుకాణాలు 48 కి పెరిగాయని ఆయన తెలిపారు. సంబంధిత మద్యం దుకాణాలకు ఈ నెల 18 వ తేదీ వరకు ఔత్సాహికుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, దరఖాస్తుదారులు 5 కలర్ ఫోటోలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, ఎస్సీలకు, గీతన్నలకు ప్రత్యేకంగా కేటాయించిన దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు కుల ధృవీకరణ పత్రం జిరాక్స్ తో పాటు జిల్లా ప్రొబేషనరీ ఎక్సైజ్ అండ్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల పేరిట రెండు లక్షల రూపాయల డీడీ లేదా చలాన్ నేషనలైజెడ్ బ్యాంకు ద్వారా చెల్లించాలని తెలిపారు. ఇట్టి దరఖాస్తులను సంబంధిత దరఖాస్తుదారులు స్వయంగా వచ్చి కార్యాలయ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ ఎఫ్-25 సమర్పించాలని అన్నారు. ఈ నెల 20 వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఒక దుకాణానికి ఒక్కరే అభ్యర్థి ఎన్నైనా దరఖాస్తులు వేసుకోవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో వేములవాడ ఎక్సైజ్ సీఐ జి. రాము, ఎస్సైలు శ్రీనివాస్, స్వరూప, కిషన్, శేఖర్, రాజేందర్,శ్రీకాంత్, సీనియర్ సహాయకులు గణేష్, మహేష్, షరీఫ్, జూనియర్ సహాయకులు రమేష్,యశ్వంత్, సిబ్బంది పాల్గొన్నారు.
