తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలలో ముందున్నట్లే.. తెలంగాణ మహిళలు సైతం ముందుండాలి. ఇందు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, జిల్లా మేజిస్ట్రేట్ రఘురామ్, సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి 5కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 5కే రన్ కోసం వచ్చిన వారందరిలో ఉత్సాహం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ ద్వారా మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేద్దాం. అందరూ ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలాలని మంత్రి ఆకాంక్షించారు.




