????????????????????????????????????????????????
*లక్ష్మీ కళ్యాణం – చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది. ఆడవారు కానీ, మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది.*
*శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద*
????????????????????????????????????????????????
*శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం, శ్రీ లక్ష్మీ కళ్యాణం*
*పాలమున్నీటిలో పడవంపులతగా*
*పసివెన్నముద్దగా ప్రభవంబునొంది*
*కలుములు వెదజల్లు కలికి చూపులకు*
*మరులొంది మధువుకై మచ్చికలట్లు*
*ముక్కోటి వేల్పులూ ముసురుకొనంగా*
*తలపులో చర్చించి తగ నిరసించి*
*అఖిలలోకాధారు నిగమసంచారు*
*నతజన మందారు నందకుమారు*
*వలచి వరించిన వరలక్ష్మి గాధ*
*సకల పాపహరంబు సంపత్కరంబు*
*ఘన మందరాద్రినీ కవ్వంబుగాను*
*వాసుకి త్రాడుగా వరలంగ చేసి*
*అమృతంబు కాంక్షించి అసురులు సురలు*
*చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము*
*పరమ పావనమైన బారసి నాడు*
*మెరుగారు తొలకరి మెరుగుల తిప్ప*
*ఒయ్యరములలప్ప ఒప్పులకుప్ప*
*చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి*
*అష్ట దళాబ్జమందావిర్భవించె*
*నింగిని తాకెడు నిద్దంపుటలలు*
*తూగుటుయ్యాలలై తుంపెసలార*
*బాల తానటుతూగ పద్మమ్ము ఛాయ*
*కన్నె తానిటుతూగ కలువపూఛాయ*
*అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద*
*వీక్షించుచుండగా వెదురు మోసట్లు*
*కల్పధ్రువంబున కలికలంబోలి*
*పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యెనంత*
*తనువున పులకలు దట్టమై నిగుడ*
*బారసాచి ప్రమోద భాష్పముల్ రాల*
*రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ*
*రావమ్మ ఇందిరా రమణి రావమ్మ*
*లోకశోకము బాపు లోలాక్షివీవు*
*నాకు కూతురువవుట నా పుణ్యమమ్మా*
*అంచు మురిసిపోయి అంబుధి స్వామి*
*ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటె*
*సఖియను మంగళ స్నానమాడింప*
*వాసవుండర్పించె వజ్రపీటమ్ము*
*పూత నదీజలా పూర్ణ పుణ్యాహా*
*కళశాలతోడ దిగ్గజములవ్వేళ*
*జలజాతగంధికి జలకమ్ములార్చె*
*బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము*
*కట్టంగ సుతకిచ్చె కళశవారాసి*
*వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు*
*రాజీవ ముఖులైన రంభదులంతా*
*కురులు నున్నగ దువ్వికుప్పెలు వెట్టి*
*కీల్జెడ సవరించి కింజెల్కధూలి*
*చెదరనీక విరుల్ చిక్కగ ముడిచి*
*కళలు పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు*
*కమ్మని కవ్రంపు కాటుక దిద్ది*
*వెన్నెల తెటయౌ వెడద మోమునకు*
*గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి*
*ఆత్తరు జవ్వాజి అగరు చందనము*
*హత్తించి తనువల్లె ఆమె ముంగిటను*
*నిలువుటద్దంపును నిలిపెరంతటను*
*తనరూపు శ్రీలక్ష్మి దర్పణంబందు*
*కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి*
*సింహసనము దిగి చెంగళ్వదండ*
*చెదార్చి అచ్చెరల్ చేరి కొల్వంగా*
*కుచ్చెళ్ళు మీగాల్ల గునిసియాడంగా*
*గరుడ గంధర్వ యక్ష రాక్షస దివిజ*
*సంఘముల మద్యకు సరుగున వచ్చె*
*చెప్పచోద్యంబయిన శ్రుంగారవల్లి*
*మొలకనవ్వుల ముద్దు మోమును చూచి*
*సోగ కన్నుల వాలు చూపులు చూచి*
*ముదురు సంపెంగ మొగ్గ ముక్కును చూచి*
*అమృతంబు తొలకెడు అధరంబు చూచి*
*సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి*
*ముత్యాల మెచ్చని మునిపండ్ల చూచి*
*పాలిండ్లపైజారు పయ్యెద చూచి*
*జవజవమను కౌసు సౌరుని చూచి*
*గుండ్రని పిరుదుల కుదిరిక చూచి*
*కమనీయ కలహంస గమనంబు చూచి*
*మొగమునకందమౌ మొటిమను చూచి*
*మధుసూధనుడు తక్క మగవారలెల్ల*
*వలపు నిక్కాకకు వశవర్తులైరి*
*కన్నులకెగదన్ను కైపున తన్ను*
*తిలకించుచున్నట్టి దిక్పాలకాది*
*సురవర్గమును చూచి సుదతి భావించె*
*ఒకడంటరానివాడొకడు జారుండు*
*ఒకడురక్తపిపాసొక్కడు జడది*
*ఒక్కడు తిరిపెగాడొకడు చంచలుడు*
*కాయకంఠి ఒకండు కటికవాడొకడు*
*ఒక్కటి తరకైన ఒక్కటి తాలు*
*ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు*
*శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు*
*పుండరీకాక్షుండు భువనమోహనుడు*
*శంఖచక్రధరుండు శారంగహస్తుండు*
*తప్తచామీకరా ధగధగద్ధగిథ*
*పీతాంబరధరుండు ప్రియదర్శనుండు*
*మణిపుంజరంజిత మంజులమకుట*
*మకరకుండలహార మంజీరకటక*
*కాంచికాకేయూర కమ్రభూషణుడు*
*అనుపమ ఙ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య*
*గాంభీర్య మార్థవౌదార్య శౌర్య స్థైర్య చాతుర్య*
*ముఖ్య కళ్యాణ గుణగణ మహార్ణవుండు*
*తనకు నీడగువాడు తననించు వాడు*
*విశ్వమంతయును తానైనవాడు*
*శేశాద్రినిలయుండు శ్రీనివాసుండు*
*పతియైన సుఖములు పడయంగ వచ్చు*
*తులలేని భోగాల తులతూగ వచ్చు*
*ఎడేడు లొకాలనేలంగవచ్చు*
*అంచు శౌరికి వేసె అలవేలు మంగ*
*చెంగళ్వ విరిదండ చిత్తమొప్పంగా*
*సకల జగంబులు జయ వెట్టుచుండ*
*శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు*
*తలయంటి పన్నీట తానమాడించి*
*తడియొత్తి వేణుపత్రములంత జేసి*
*నామంబులను దిద్ది నవభూషణముల*
*గైసేయ దివిజవర్గంబులు గొలువ*
*కదలనై రావణ గజముపై స్వామి*
*కేశవాయంచును కీరముల్ పలుక*
*నారాయణాయంచు నమలులు పలుక*
*మధవాయంచును మధుపముల్ పలుక*
*గోవిందయంచును కోయిలల్ పలుక*
*తైతక్కధిమితక్క తద్దిమ్మితకిట*
*జనుతతకజనుత జనుత యటంచు*
*అచ్చర విరిబోణి ఆడిపాడంగా*
*ముత్తైదువులు శెస ముత్యాలు జల్ల*
*చల్లగా వేంచేయు జలదవర్ణునకు*
*అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష*
*వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే*
*అదె వచ్చె ఇదె వచ్చె అల్లుడటంచు*
*మామగారెదురేగి మధుపర్కమిచ్చె*
*పందిటిలోనికి పట్టి తొడ్తెచ్చి*
*పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు*
*మంగళశాసన మంగళమ్మిడగా*
*కమలచేతికి చక్రి కట్టె కంకణము*
*దివ్యశంకంబులు తిరుచిన్నములును*
*వేణుమర్దల రుద్రవీణలు మొరయ*
*తలవంచి కూర్చున్న తన్వి కంఠమున*
*మధువైరి గీలించె మాంగళ్యమపుడు*
*చేతుల తలంబ్రాలు చేకొనికూడా*
*పొయగా వెనుకాడు పువుబోణి ముందు*
*శిరమువంచినయట్టి శ్రీధరు జూచి*
*పకపకా నవ్విరి పల్లవాధరులు*
*పదునాల్గు భువనముల్ పాలించునట్టి*
*చల్లనివిభునకు జయమంగళంబు*
*పదము మోపిన చోట పసిడి పండించు*
*చూడికుత్తుకకు శుభమంగళంబు*
*అంచు హారతులెత్త అంగనామణులు*
*సాగె బువ్వము బంతి సంతోషముగను*
*కళిత కంకణ జనాత్కారమ్ము లెసగా*
*కటక గళంగళాత్కారముల్ పొసగా*
*మొగమున తిలకంబు ముక్కున జార*
*చిరు చెమ్మటలదోగి చెదరు గంధమ్ము*
*గమగమ వాసనల్ క్రుమ్మరింపంగా*
*చురుకు చూపులకోపు చూపరగుండె*
*పలువ చిచ్చు రగల్పు వగలాడియొకతె*
*కోడిగమ్మాడెను కొమరితె ఒకతె*
*మన పెండ్లి కొడుకెంత మహనీయుడమ్మా*
*మహిళలను వలపించు మంత్రగాడమ్మ*
*మచ్చు మందులు జల్లి మది దోచకున్నా*
*కరివానినెవ్వరు కామింతురమ్మ*
*సుకియలు పోలీలు సొగియవు గాని*
*పురపుర మట్టిని బ్రొక్కెడునంట*
*పట్టె మంచము వేసి పానుపమరింప*
*పాముపై తాపోయి పవళించునంట*
*అంబారి యేనుగు అవతలకంపి*
*గద్ద మీద వయాలి కదలెడునంట*
*వింత వెషములెన్నో వేసెడునంట*
*రాసిఖ్యమటులుంచి రంగటులుంచి*
*ఆకార సౌందర్యమరయిదుమన్నా*
*కనులు చేతులు మోము కాల్లు మొత్తమ్ము*
*తామర కలికికి స్థానమ్ము సుమ్ము*
*ఈయంటు మన బాలకెపుడంటకుండా*
*తామర సిరికల ధన్యాత్మునకును*
*నలిచి నల్లేరుతో నలుగిడవలెను*
*కందనీటను ఒడల్ కడగంగవలెను*
*గంధకలేపమ్ము కడుబూయవలెను*
*వాడవాడల తిప్పి వదలంగవలెను*
*ఆ మాటలాలించి హరు పట్టమహిశి*
*మాధవ చెల్లియ ఆ మడతుకిట్లాడె*
*అతి విస్తరంబేల అందాల చిలుక*
*నీవు నేర్చిన తెలుగు నెర్తురే యురులు*
*వెన్నుని నలుపంచు వెక్కిరించితివి*
*నెలతుక ఎరుపంచు నిక్కుచూపితివి*
*కలువ పూవూ నలుపు కస్తూరి నలుపు*
*కందిరీగ యెరుపు కాకినోరెరుపు*
*ఈ రెండు రంగులందేరంగు మెరుగో*
*సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు*
*వరుని చూచిన కంట వధువుని చూడు*
*మాయ మర్మము వీడి మరి పదులాడు*
*కళికి కాల్సేతులు కన్నులు మోము*
*తామర విరిసిన తావులు కావో*
*కొమ్మ మేనికి దూలగొండి రాచెదవో*
*కంద నీటికిగిచ్చగారవించెదవో*
*ఇంతింత కన్నుల ఎగదిగ చూచి*
*సిగ్గుతో నెమ్మోము చేత కప్పుకొని*
*అనలు కొనలు వేయు అనురక్తి తోడ*
*రసికత లేని మా రంగని మెడను*
*పూలమాలను వేసి పొలుపుగా అతని*
*గుండెలపై చేరి కులుకంగ తలచు*
*రంగనాయకి ఎంత రసికురాలమ్మ*
*చపరలోచన ఎంత చపలురాలమ్మా*
*ఆనవ్వు లీనవ్వులరవిరిమల్లె*
*అందాలు చిందుచు అలరింప మదులు*
*సకల వైభవములా జరిగెను పెండ్లి*
*అంపకమ్ముల వేల అరుదెంచినంత*
*పసుపు కుంకుమ పూలు పండుటెంకాయ*
*తాంబూలమొడి దాల్చి తరళాక్షి లక్ష్మి*
*తలపు లోపల క్రుంగు తండ్రిని చేరి*
*నాయనా యని పిల్చి నవదుఖ: భాష్ప*
*కణములు జల జల కన్నుల రాల*
*గుండెపై తల వాల్చి కుములుచుండంగా*
*కడివెడు బడబాగ్ని కడుపులోననిచి*
*శిరమున మూర్కొని చెక్కిళ్ళు నిమిరి*
*పాలపూసల తల్లి భాగ్యాల వెల్లి*
*వేడ్క అత్తింటికి వెళ్ళి రావమ్మా*
*ఆడ పిల్లలకు తండ్రి అయ్యెడు కంటే*
*మతి గతి లేనట్టి మానౌట మేలు*
*వీనుల నీ పాట వినిపించుచుండ*
*కన్నుల నీ ఆట కనిపించుచుండ*
*ఊరటతో యెట్టులుండెదనోయమ్మా*
*గడియలొ నిను వచ్చి కనుకుందునమ్మా*
*అనిసాగరుడు పుత్రిననునయింపంగా*
*బుద్దులు గరపిరి పుణ్య కామినులు*
*ఏమి నోము ఫలంబొ ఏమి భాగ్యమ్మో*
*వేదంతవేద్యుడు విభుడాయె నీకు*
*ఆముదాలన్నియూ ఆణిముత్యములే*
*చిగురుబోండ్లందరూ సింధు కన్యకలే*
*తల్లినీవెరుగనీ ధర్మంబుగలదే*
*నెలతనీవెరుగనీ నీతులున్నవియే*
*పదుగురు నడిచిన బాటయే బాట*
*మందికి నచ్చిన మాటయే మాట*
*మంచిని విత్తిన మంచి ఫలించు*
*జొన్నలు విత్తిన చోళ్ళేల పండు*
*పోయిరాగదమ్మ పుత్తడిబొమ్మ*
*నీదుపుట్టింటిపై నెనరుంపరమ్మ*
*కనిపెంచకున్ననూ కళ్యాణి నిన్ను*
*కన్నుల చూడక పొద్దు గడచునే మాకు*
*చిలుకలు పలికిన చిగురుమావిళ్ళ*
*కోయిలల్ కూసిన గుండెలెట్లాడు*
*పొగడ చెట్లకు వ్రేలు పూదొట్ల గన్నా*
*నిమ్మలంబుగ యెట్లు నిలుతుమే కన్నా*
*కాటుకాయను కాంతనేనిత్తు*
*కుంకుమ భరణిని కొమ్మనేనిత్తు*
*జోడు సొమ్మెలు నీకు జోటినేనిత్తు*
*పట్టినదంతయు బంగారు కాగా*
*ముట్టినదెల్లయూ ముత్యంబు కాగా*
*కడుపు సారెకు వేగ కదిలిరావమ్మ*
*మదిలోన మమ్ముల మరిచిపోకమ్మ*
*అంత మహాలక్ష్మి అనుగు నెచ్చెలుల*
*చెక్కిళ్ళు ముద్దాడి చుబుకంబునంటి*
*కంఠంబు నిండిన కన్నీళ్ళనాపి*
*బంగారు చెలులారా ప్రాణంబులారా*
*నేనయిమీరెల్ల నెగడిమాయింట*
*అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ*
*పట్టు కుచ్చులు నావి పరికిణీల్ నావి*
*పందిట తూగాడు పవిటల్ నావి*
*కాళ్ళ గజ్జెలు నావి కడియాలు నావి*
*పొలుపైన బచ్చెన బొమ్మలు నావి*
*బొమ్మలకునువెట్టు భూషణముల్ నావి*
*స్వేచ్చగా మీరెల్ల చేకోరమ్మా*
*అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా*
*అని బుజ్జగములాడి అందలంబెక్కి*
*కమళాక్షునింటికి కదిలె శ్రీలక్ష్మి*
*కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు*
*కండచక్కెర పాలు కలిసియున్నట్లు*
*అంజనాచలవాసుడలమేలుమంగ*
*జంట వాయక సుఖ సంతోషలీల*
*సాధురక్షణమును సలుపుచున్నారు*
*సాధురక్షణమును సలుపుచున్నారు*
*అఱుగని మంగళసూత్రము చెరగనికుంకుమ,పసుపు,చెదరని సిరులున్,తఱుగని సుఖము లొసంగును,హరిసతి యీ పాట విన్న అబలల కెపుడున్.*

????????????????????????????????????????????????




