పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఆగిన గుండె..
గుండెలు ఆగిపోతున్నాయి. నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోతున్నారు. అప్పటిదాకా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న వాళ్లు క్షణాల్లోనే మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 20 ఏళ్లు కూడా నిండని యువకుడు కుప్పకూలి చనిపోయాడు.
పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి పార్డిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికుమారుని బంధువు, మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19).. ఈ వేడుకకు హాజరయ్యాడు. అప్పటిదాకా డ్యాన్స్ చేసిన అతడు.. ఉన్నట్టుండి ఆగిపోయి.. అలానే కిందికి పడిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో 4 రోజుల కిందట ఓ పెళ్లి వేడుకలో వరుడికి గంధం రాస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మరో ఘటనలో ఓ యువ కానిస్టేబుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. కుప్పకూలి మరణించాడు.