– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్*
రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 21: ఈ నెల 27 నుండి మార్చి 1 వరకు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పల్స్ పోలియో నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పల్స్ పోలియో వంద శాతం పూర్తిచేయుటకు పకడ్బందీ కార్యాచరణ చేశామన్నారు. జిల్లాలో 5 లక్షల 52 వేల 37 మంది జనాభా ఉండగా, ఇందులో 46 వేల 147 మంది 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలున్నట్లు అంచనా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 402 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు, గుర్తించిన 101 హై రిస్క్ ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హై రిస్క్ ప్రదేశాల్లో సుమారు 503 మంది 0-5 పిల్లలున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమ అమలుకు 38 మంది సూపర్వైజర్లు, 15 మొబైల్ టీములు, 17 ట్రాన్సిట్ పాయింట్స్, 336 మంది వ్యాక్సిన్ క్యారియర్స్ లను నియమించామన్నారు. కోవిడ్ జాగ్రత్తల దృష్ట్యా మాస్కులు, సానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమానికి రెండు రోజులు ముందుగానే టామ్ టామ్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఎంపీడీఓలు స్థానిక వైద్యాధికారులకు సహకరించాలన్నారు. పాఠశాలల్లోని నోటీస్ బోర్డుల్లో కార్యక్రమాన్ని ప్రదర్శించాలని, ప్రార్థనలు ఇతరత్రా ఒక్కచోట చేరే ప్రదేశాల్లో పల్స్ పోలియో గురించి అవగాహన కల్పించాలని అన్నారు. మొబైల్ టీములు ద్వారా ఇటుక బట్టీ కార్మికులు, నిర్మాణ కార్మికులు, రైస్ మిల్లులు ఇతర ఫ్యాక్టరీల వద్ద పనిచేసేవారు, సంచార జాతుల జనాభా వద్ద 0-5 వయస్సున్న పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. గ్రామైక్య సంఘాలు, ఐకేపి సిబ్బందిని భాగస్వాములను చేసి వందశాతం పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛంద సంస్థల నుండి బ్యానర్లు, ఇతరత్రా ఏర్పాటుకు సహకారం తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, డీఈఓ రాధాకిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీపీఓ ఏ. రవీందర్, మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. రజిత, ప్రోగ్రాం అధికారి డా. కపిల్, తదితరులు పాల్గొన్నారు.





