-రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావు*
-దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు*
-గోదావరి జలాలతో జిల్లాలో భూగర్భ జలాలమట్టం గణనీయంగా పెరిగింది*
-తంగళ్ళపల్లి మండలంలోని బద్దెనపల్లి క్లస్టర్ రైతువేదిక ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్*
రాజన్న సిరిసిల్ల :తెలుగు న్యూస్ 24/7
ఫిబ్రవరి 18: రాష్ట్రంలోని రైతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల శ్రేయస్సు కోరి, రైతులు లాభసాటి పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శుక్రవారం మంత్రి తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో 22 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్లస్టర్ రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు, వారు లాభసాటి పంటలు సాగు చేసేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేసి ప్రతీ క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులు అందించే సూచనలతో రైతులు లాభదాయకమైన పంటలు సాగు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రాంతంలో ఏ పంటలు సాగు చేయడానికి అనువుగా ఉన్నాయో రైతులకు తెలియజెప్పడంలో వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల శ్రేయస్సు సౌకర్యార్థం 2 వేల 603 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించడం జరిగిందని తెలిపారు. పంట పెట్టుబడి సహాయం కోసం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడం, రైతు మరణిస్తే వారి కుటుంబానికి భరోసాగా 5 లక్షల ప్రమాద భీమా రైతుభీమా పథకంలో భాగంగా సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. గోదావరి జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా సస్యశ్యామలంగా మారిందని ఆయన తెలిపారు. అన్నపూర్ణ, రాజరాజేశ్వర, నిర్మాణ ప్రగతిలో ఉన్న మల్కపేట జలాశయాల ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం 6 మీటర్ల మేర పెరిగిందని అన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో పాఠ్యాంశంగా బోధించడం మన జిల్లాకే గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఇంచార్జ్ డీఆర్ఓ టి. శ్రీనివాస రావు, ఎంపీపీ పడిగెల మానస, జెడ్పీటీసీ పూర్మాని మంజుల, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపీడీఓ లచ్చాలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.





