జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
-డిమాండ్ కు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను పెంచాలి*
-ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలి*
-మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి*
-ఎంపీడీఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్*
రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి18: గ్రామాల్లో ఇంటి పన్నులు వసూలు వంద శాతం పూర్తయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని, నర్సరీల్లో గ్రామ ప్రజల డిమాండ్ కు అనుగుణంగా మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ అన్ని మండలాల ఎంపీడీఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయితీల నిర్వహణపై అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామ పంచాయితీ ట్రాక్టర్ల లోన్ల చెల్లింపులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని అన్నారు. ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కల పెంపకం వివరాలపై ఆరా తీశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలన్నీ వంద శాతం సంరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తమ మండలంలో ఎంపికైన పాఠశాలల్లో పాఠశాల నిర్వహణ కమిటీలతో సమావేశాలు నిర్వహించి, ఆయా పాఠశాలల్లో ఏయే పనులు చేపట్టాల్సి వస్తుందో క్షుణ్ణంగా అంచనా వేసుకుని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో, ఏజెన్సీ నిర్వాహకులతో చర్చించాలని అన్నారు. సంబంధిత మండలాల ఎంపీడీఓ లు తమ మండల విద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతీ పాఠశాలకు రెండు జాయింట్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు చేపట్టిన ఈ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేసి మెరుగైన ఫలితాలు సాధించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీపీఓ ఎ. రవీందర్, డీఆర్డీఓ కె. కౌటిల్య, పంచాయితీ రాజ్ ఈఈ సూర్యప్రకాష్, అడిషనల్ డీఆర్డీఓ మదన్ మోహన్, ఏపీడీ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
