ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలోనే ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల నిధులు కేటాయించాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచీ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని వారి నివాసం లో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికి బడ్జెట్ ప్రసంగం లో ఎస్సీ ఉప కులాల ప్రస్తావన లేకపోవడం దారుణం అన్నారు. ఈ రాష్ట్రం లో 22 లక్షల జనాభా కలిగి దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సీ 57 ఉపకులాల ప్రజలు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలను మాల, మాదిగ కులాలు తప్ప మిగతా 57 ఉపకులాలకు అందడం లేదని ఈసారైనా ప్రస్తుత 2023-24 బడ్జెట్ లో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పురం శివశంకర్ మాల జంగం , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.