భారతదేశానికి దిశా నిర్దేశం నిర్దేశించి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అడ్డువస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని బిడిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య డిమాండ్ చేశారు. శనివారం రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థానిక సర్పంచ్, పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసి నిర్మిస్తున్న గద్దెను తొలగిస్తే దళిత బహుజన, ప్రజా సంఘాలు గ్రామాన్ని సందర్శించి అదే స్థానంలో పునర్నిర్మాణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన అభ్యంతరాలు ఏమిటో స్థానిక సర్పంచ్, పోలీసులు తెలియజేయాలన్నారు. దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు గుడి మసీదు చర్చిలు ఎన్నో నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి లేని అనుమతులు కేవలం అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు అవసరమో చెప్పాలన్నారు. ఇదే బేగంపేట గ్రామంలో ఆ రోడ్డు పక్కనే వివేకానంద విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి ఎవరి అనుమతి తీసుకున్నారో చెప్పాలన్నారు. అంబేద్కర్ అంటే ఒక కులానికి, ఒక మతానికి ఒక వర్గానికి ఉద్యమించలేదు. ఈ దేశంలో నివసించే ప్రతి మనిషికి ప్రతి జీవరాశికి స్వేచ్ఛ సమానత్వం కోసం తన జీవితాంతం పోరాటం చేసి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు అయ్యారని ఆయన రాజ్యాంగం రాయకుండా ఉంటే మీరందరూ పదవులు అనుభవించేవారు కాదన్నారు. స్థానిక పోలీసులు సర్పంచ్ ఫిర్యాదు మేరకు దళితులను బెదిరింపులకు గురిచేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిర్మాణం చేస్తున్న గద్దెను తొలగించడం సమంజసం కాదన్నారు. ప్రజల పన్నుల ద్వారా ప్రజల రక్షణ కోసం శాంతిభద్రతలు కాపాడడం కోసం పనిచేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం సరైనది కాదన్నారు. ఎన్నికల కోసం ఎమ్మెల్యే, ఎంపీలు గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతారని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు గ్రామాన్ని సందర్శించడం లేదని దళితులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కమిషనర్, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీలు గ్రామాన్ని సందర్శించి ఈ నెల చివరన 28వ తేదీన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పే విధంగా చూడాలన్నారు. బేగంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎవరు ఆటంకం కలిగించిన ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు దేవేందర్, ఉప సర్పంచ్ లా ఫోరం మండల అధ్యక్షులు తూర్పు లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి రామచంద్రం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ నాస్తిక్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండ స్వామి, ఎస్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదాంత్ మౌర్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల స్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుులు జంజీరపు ఎల్లేష్, తెలంగాణ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రాజయ్య, ఎమ్మార్పీఎస్ కన్వీనర్ కృష్ణ, డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు జింక సంజీవ్, దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ సంజీవ్, దళిత బహుజన నాయకులు గజ్వేల్ రామచంద్రం, బీఎస్పీ మండల tకన్వీనర్ సుక్కం స్వామి, అందే ప్రవీణ్, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు మంకిడి స్వామి, ఎస్ఎస్ఎఫ్ నాయకులు రాజు, వెంకటేష్, లోకేష్, శ్రీను, అచ్యుత్, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు మధుసూదన్ , శ్రీకాంత్, ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
