మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట పట్టణం మంగమ్మ తోటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు, మరుగుదొడ్ల రిపేర్ పనులను పరిశీలించి మన ఊరు మనబడి నిర్మాణ పనులలో వేగం పెంచి ఒక నెల రోజుల లోపల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఇన్చార్జి హెచ్ఎం శ్రీదేవి మరియు నిర్మాణ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అదేవిధంగా 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ చొప్పున ఇప్పటికే సరిపోయే టాయిలెట్స్ పాఠశాలలో అందుబాటులో ఉన్నందున వాటిని రిపేర్ చేసి అవసరమైన నీటి వసతి సరి చూసుకోవాలని అన్నారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలలో అవసరమైన బోర్వెల్ కోసం గ్రాండ్ వాటర్ అధికారిని ఆదేశిస్తానని తెలిపారు.
ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్యకు సరిపడే గదులు లేనందున మరియు ఉర్దూ మీడియా విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఉర్దూ మీడియం విద్యార్థులను గవర్నమెంట్ హై స్కూల్ -2 కు షిఫ్ట్ చేసేందుకు, అవుసరమైన డ్యూయల్ డెస్క్ లను సమకూర్చేందుకు, పాఠశాలలో అదనంగా ఉన్నా స్నేహాభాల కుర్చీలను అవుసరమున్న ఇతర పాఠశాలలకు తరలించేందుకు డిఇఓకు ఆదేశాలు జారీ చేస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. భోదనా సామాగ్రిని ర్యాకులలో పొందుపరచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి అధిక సంఖ్యలో నిలువ ఉన్న పాఠ్యపుస్తకాలను అవసరమైన పాఠశాలకు చేరవేయాలని స్టోర్ ఇన్చార్జిని ఆదేశించారు.
కలెక్టర్ వెంట సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.