మకర సంక్రాంతి వేడుకలు మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. పాడి పంటలు ఇంటికి చేరిన సందర్భంగా రైతులు జరుపుకునే పండగగా పేరున్న సంక్రాంతి గ్రామాలలో ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా మహిళలు రంగురంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు చూపర్లను ఆకట్టుకున్నాయి. యువతులు ఒకరిని మించి ఒకరు వాకిళ్లలో రంగురంగుల రంగులతో అలంకరించిన ముగ్గులను వేసి తమ సృజనాత్మకతను నిరూపించుకున్నారు. చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు, అలాగే బ్రతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం పండగ సందర్భంగా గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాలు సందడితో కలకలలాడాయి.
