కంటి వెలుగు కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి జిల్లాలో బర్త్ ప్లానింగ్ పై దృష్టి సారించి అన్నికాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి, వైద్యారోగ్య శాఖ పథకాల అమలుపై చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు పెంచేందుకు తొలి కాన్పులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు. గర్భధారణ జరిగిన మూడు నెలల్లోగా మహిళలను గుర్తిస్తే వారి హెల్త్ ట్రాక్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
సామ్ Severe Acute Malnutrition (SAM), ఎనిమీక్ అడోల్ సేoట్ గర్ల్స్ కేసులను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో ప్రతి గర్భిణీ వివరాలను నమోదు చేస్తున్నారనీ తెలిపారు. రెండో నెల నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణీ ఆరోగ్య స్థితిపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొనసాగేలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులకు ఏఎన్‌సీ నమోదు సందర్భంలో సాధారణ ప్రసవం అయ్యేలా మోటివేషన్ చేయాలన్నారు.జిల్లాలో క్షయ వ్యాధి బాధితులను గుర్తించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, వాటికీ విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో టీబీ నిర్దారణ అయిన కేసులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి,
వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. వారికి అందించే 500 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.ఆరోగ్య కేంద్రాలు ఎన్ క్వాస్ గుర్తింపు పొందేలా సంబంధిత మెడికల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన పనులను గుర్తించి, అన్ని వసతులు సమకూర్చాలని సూచించారు.జిల్లా ఆసుపత్రి రెండవ అంతస్తులో అదనంగా 100 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న పనుల పురోగతిని, మెడికల్ కళాశాల నిర్మాణ పనులపై కలెక్టర్ ఆరా తీశారు. పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు,జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారులు డా. రజిత, డా.శ్రీరాములు, ఇమ్మ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి డా.మహేష్, తదితరులు పాల్గొన్నారు.
