ప్రాంతీయం

ప్రజలకు పోలీసులపై భరోసా. బాధితులకు న్యాయం. నేరస్తులకు చట్టపరమైన శిక్షే లక్ష్యం* పటిష్టమైన దర్యాప్తుతో 76 కేసుల్లో 112 మందికి శిక్షలు*పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటమే మా బాధ్యత: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

7 Views

తెలుగు న్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్:

నేరాల దర్యాప్తులో నాణ్యత, న్యాయస్థానాల్లో పటిష్టమైన ఆధారాల సమర్పణ, సమర్థవంతమైన సమన్వయంతో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
2026 సంవత్సరంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 76 కాంటెస్టెడ్ కన్విక్షన్ కేసుల్లో 112 మంది నిందితులకు న్యాయస్థానాలు శిక్షలు విధించాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

*శిక్షల వివరాలు:*

– 8 కేసుల్లో 8 మందికి జీవిత ఖైదు,మొత్తం రూ.55,000 జరిమానా.
– 2 కేసుల్లో 5 మందికి 20 సంవత్సరాల జైలు శిక్ష,మొత్తం రూ.21,000 జరిమానా.
– ఒక కేసులో ఒకరికి 12 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,00,000 జరిమానా.
– 9 కేసుల్లో 10 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష, మొత్తం రూ.90,000 జరిమానా.
– ఒక కేసులో ఒకరికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా.
– 5 కేసుల్లో 7 మందికి 5 సంవత్సరాల జైలు శిక్ష, మొత్తం రూ.84,000 జరిమానా.
– మరో 39 కేసుల్లో 49 మందికి 4 సంవత్సరాలలోపు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.
– 11 కేసుల్లో 31 మందికి మొత్తం రూ.1,30,300 జరిమానా మాత్రమే విధించారు.

ఈ కేసులన్నింటిలో కలిపి న్యాయస్థానాలు మొత్తం రూ.7,44,500 జరిమానా విధించాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, నేరం చేసిన వ్యక్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు.కేసు నమోదు చేసినప్పటి నుంచి దర్యాప్తు పూర్తి చేయడం, శాస్త్రీయ ఆధారాలను సేకరించడం, సాక్ష్యాలను పటిష్టంగా రూపొందించడం, వాటిని న్యాయస్థానాల్లో సమర్థవంతంగా ప్రవేశపెట్టడం వరకు ప్రతి దశలో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఒక కేసులో నేరం నిరూపితమై నిందితుడికి శిక్ష పడినప్పుడు బాధితులకు న్యాయం జరగడంతో పాటు, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై, న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత బలపడుతుందని తెలిపారు.నేరం చేసిన వారికి చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదనే నమ్మకమైన సందేశం సమాజానికి అందుతుందని అన్నారు.ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు,హత్యలు, పోక్సో మరియు ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేపట్టి,ప్రతి అంశాన్ని పకడ్బందీగా న్యాయస్థానాల ముందు నిరూపించాలని సూచించారు.
పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు.కీలక కేసుల్లో నేరం నిరూపితమై, నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మరింత అంకితభావంతో పనిచేస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *