తెలుగు న్యూస్ మంచిర్యాల:
ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా ప్రజలందరికీ ఓటు హక్కు, విలువ తెలిసేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రోరల్ లిటరసి క్లబ్ పోటీల ముగింపు కార్యక్రమానికి అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ ఓటర్లలో ఎన్నికలపై అవగాహన పెంపొందించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలలో ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల ప్రకారం ఈ పోటీలు సంస్థ స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో 3 దశలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. వ్యాసరచన పోటీలు స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కు ప్రాముఖ్యత అంశాలపై, క్విజ్ పోటీలు ఓటరు జాబితా తయారీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై నిర్వహించడం జరిగిందని తెలిపారు. 3 దశలలో పోటీలు నిర్వహించి ప్రతి పోటీలో జిల్లా స్థాయి ఉత్తమ 10 మంది విజేతలను ఎంపిక చేయడం జరిగిందని, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ కో-ఆర్డినేటర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





