ప్రాంతీయం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   

7 Views

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్                       తెలుగు న్యూస్ మంచిర్యాల:
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వణ అధికారి గణపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి కిషన్, గృహ నిర్మాణ శాఖ పి.డి. బన్సీలాల్‌ లతో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈ లతో ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని, అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని వేగవంతం చేయాలని తెలిపారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను త్వరితగతిన గుర్తించాలని, సంబంధిత ప్రజాప్రతినిధుల నుంచి వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం అర్హులైన పేదలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని తెలిపారు. ఇండ్లు మంజూరై నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల వివరాలు సేకరించి, పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని, అనర్హుల స్థానంలో అర్హులైన పేదలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. హౌసింగ్ ఏఈలు ప్రతి ఇంటి నిర్మాణాన్ని దశల వారీగా ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, పూర్తయిన ఇళ్ల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి నిర్మాణాల పురోగతిని స్పష్టంగా చూపించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు జాబ్ కార్డుల వెరిఫికేషన్‌ను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి, సదుపాయాలు అందుబాటులో ఉన్నందున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ఆశించిన పురోగతి సాధించాలని తెలిపారు.

చేయూత పింఛన్ల పంపిణీ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ఈ నెల 12వ తేదీలోగా అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ నెల 12వ తేదీన కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, 12 నుంచి 18వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్ల మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని తెలిపారు. అర్హులైన పింఛనుదారుల ఖాతాలలో ఈ నెల 19వ తేదీన నగదు జమ అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాలలో రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, సాగునీటి చెరువులు, కాలువలలో పూడికతీత పనులు చేపట్టాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పశువులకు అవసరమైన పశుగ్రాసం, త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, సరైన కొలతల పుస్తకం (ఎం.బి.) నమోదు చేయకుండా బిల్లులు సమర్పించినా, చెల్లింపులు చేసినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులతో గూగుల్ మీట్ నిర్వహించి గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పనుల పురోగతి, పెండింగ్ సమస్యలపై సమీక్ష నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా, అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *