సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1999–2000 విద్యా సంవత్సర బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో కలిసి చదువుకున్న నాటి అనుభవాలను, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు మెమెంటోలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి దశలో ఉపాధ్యాయులు అందించిన బోధన, మార్గదర్శకత్వం తమ జీవితాల్లో ఎంతో కీలకమని పూర్వ విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పాత మిత్రులు, గురువులతో కలిసి గడపడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





