రైతులు సాగు చేసిన వరి పంటలు నీటి కొరతతో ఎండిపోతున్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు అనాజిపూర్ గ్రామ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి చొరవ చూపారు. శుక్రవారం రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలోని పెద్ద చెరువు నుంచి వరి పంటలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వరి పంట కీలక దశలో ఉన్న సమయంలో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలు ఎండిపోకుండా, దిగుబడిపై ప్రభావం పడకుండా ఉండేందుకు పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పంటలకు అవసరమైన సమయంలో నీటి సరఫరాపై సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకన్న స్వామి, వెంకని మల్లేశం, అంకుల్‌గారి రాజు, రాచకొండ రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.





