రైతుల వ్యవసాయ బోర్‌వెల్ మోటార్లను చోరీ చేస్తున్న వ్యక్తిని రాయపోల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు బోర్ మోటార్లు, రూ.6 వేల నగదు, చోరీలకు ఉపయోగించిన ద్విచక్రవాహనం, రంపం పారా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.1.13 లక్షలు.
తొగుట సీఐ లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం రాయపోల్ పరిధిలో నాలుగు, దౌల్తాబాద్ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం ఐదు చోరీలకు పురుషోత్తం బాబు (37) పాల్పడినట్లు గుర్తించారు. వ్యవసాయ భూముల వద్ద బోర్ మోటార్లను రంపంతో కట్ చేసి ద్విచక్రవాహనంపై తరలించి, ఇనుప సామగ్రి కొనుగోలుదారులకు విక్రయించేవాడని విచారణలో తేలింది. లింగారెడ్డిపల్లి శివారులో చోరీ చేసిన మోటారును గజ్వేల్‌కు తరలిస్తుండగా కొత్తపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడు. అతని నుంచి మోటార్, రంపం స్వాధీనం చేసుకుని విచారించగా గతంలో చేసిన చోరీలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సీపీ రశ్మి పెరుమాళ్ పర్యవేక్షణలో, గజ్వేల్ ఏసీపీ నర్సింలు ఆదేశాలతో సీఐ లతీఫ్, ఎస్ఐ మానస ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.




