రాయపోల్ మండల ఎంపీడీవోగా ఏడేళ్లపాటు విధులు నిర్వహించి బదిలీపై మద్దూరు మండలానికి వెళ్తున్న సందర్భంగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. రాయపోల్ మండలం ఏర్పాటుకు ముందునుంచే ఈ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందన్నారు. నారాయణరావుపేటకు డిప్యూటేషన్‌పై వెళ్లి తిరిగి రాయపోల్‌కు రావడం జరిగిందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉందన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తన కుటుంబ సభ్యుల్లాంటివారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు. సర్పంచులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే మండలం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేకుల నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.





