*సీ సీ సి నస్పూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం**లారీ–ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి**ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి దిగ్భ్రాంతి**
*మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.25 వేల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం ప్రకటించిన మంత్రి*
*మంచిర్యాల, సెప్టెంబర్ 28:* మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ–ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను మందమర్రి మండలానికి చెందిన మహిళలుగా గుర్తించారు.
ప్రమాద ఘటనపై శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పందించారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం వ్యక్తిగతంగా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.





