రామగుండం పోలీస్ కమిషనరేట్
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్,సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్వప్నరాణి గురువారం తీర్పు వెల్లడించారు.
నిందితుడి వివరాలు
వినోద్ మాజి, తండ్రి:రాజ్ కుమార్ మాజి,
28 సం.లు.నివాసం: రూప్‌నారాయణ్‌పూర్,వైశాలి జిల్లా, బీహార్ రాష్ట్రం. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు.
వివరాల్లోకి వెళితే. 2024 జూన్ 13వ తేదీన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఒక రైస్ మిల్లులో అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు హత్య చేశాడు.
ఈ ఘటనపై 2024 జూన్ 14వ తేదీన మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ,సీఐ సుబ్బారెడ్డి,ఎస్‌ఐ శ్రావణ్‌లు వేగవంతంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ బాధితుల తరఫున న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదనలు వినిపించి, సాక్ష్యాధారాలను సమర్పించడంలో కీలక పాత్ర పోషించారు. సాక్ష్యాధారాలను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ న్యాయమూర్తి స్వప్నరాణి, నిందితుడు వినోద్ మాజికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించారు.
కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఏసీపీ కృష్ణ,సీఐ సుబ్బారెడ్డి,ఎస్‌ఐ శ్రావణ్,కోర్టు డ్యూటీ అధికారి శ్రీనివాస్, లైజన్ అధికారి కోటేష్‌లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.





