ప్రజలకు భద్రతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు
*మంచిర్యాల జిల్లా* ఆగస్టు 15, 2026:
ప్రజలకు మరింత పారదర్శకంగా, అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు క్యూఆర్ కోడ్ భద్రతతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, కనీస వేతనాల బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి బ్రహ్మారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్ లతో కలిసి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు దూసుకెళ్తుందని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు. మంచిర్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఈ విజయంలో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల కృషి అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో లబ్ధిదారులకు కార్డులు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని, ర్యాంకింగ్‌లో 2వ స్థానంలో, విద్యార్థుల నమోదు విషయంలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1 కోటి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని, కొత్త సాంకేతికతతో రూపొందించిన ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఆరు గ్యారంటీల అమలులో స్మార్ట్ కార్డులు కీలకంగా మారనున్నాయని, రాష్ట్రంలో ప్రజాపాలన నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్‌తో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా 100 మంది లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులు ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తోందని, రైతులు పండించిన సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ అందిస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో నూతనంగా 40 వేల 456 రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని, రేషన్ కార్డు ద్వారా అర్హులైన లబ్ధిదారులు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ప్రజలకు మరింత పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా సేవలు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వ పథకాలు అందించేందుకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించడం జరిగిందని తెలిపారు. సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కొనసాగింపుగా మంచిర్యాల జిల్లాలో 100 మంది లబ్ధిదారులకు కార్డులను అందించడం జరిగిందని, మండలాల వారీగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, మంచిర్యాల నియోజకవర్గంలో పంటల ఉత్పత్తి ఊహించని విధంగా పెరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ మినహా ఇతర కేటగిరీలకు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు జారీ చేయడమే కాకుండా ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజలు, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, వేగంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అర్హులకు అందజేయడంలో స్మార్ట్ రేషన్ కార్డులు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





