*మంచిర్యాల జిల్లా*
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
జూలై 30, 2026:
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి డి.జి.పి. సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్ష పరిస్థితులు, చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 24×7 పని చేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మోహరించి పూర్తి అప్రమత్తంగా ఉంచామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కూలిపోయే ప్రమాదం ఉన్న పాత భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని తెలిపారు. పోలీసు శాఖతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచిస్తూ, “జీరో క్యాజువాలిటీస్” లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
రాష్ట్ర డి.జి.పి. మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారులు తప్పనిసరిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను అనుసరించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించామని, అవసరమైన చోట ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా స్థాయిలో పోలీసు శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పని చేసి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాల సభ్యులను సమన్వయం చేసుకొని ప్రజా రక్షణ చర్యలు చేపడుతామని తెలిపారు. జిల్లాలోని వాగులు, నదులు, కల్వర్టుల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టి ప్రజలు అటువైపుగా వెళ్లకుండా నిఘా నిర్వహిస్తున్నామని, లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థ భవనాల ప్రజలను ముందస్తు చర్యలలో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఎ.భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





