Breaking News

బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం

5 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం.*
*డ్రగ్స్,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ ఉషారాణి*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, బాలికల భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో కానీ, బయట కానీ ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా లేదా భయాందోళనలకు గురిచేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాలికలు,మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు చిన్నచిన్న విషయాలకు ఆవేదన చెందకుండా తమ లక్ష్యంపై దృష్టి సారించి చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిలో క్రమశిక్షణ,మంచి విలువలు పెంపొందేలా కృషి చేయాలని కోరారు.మత్తు పదార్థాల వినియోగం యువత జీవితంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుందని ఆమె వివరించారు.డ్రగ్స్ వినియోగం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా వ్యక్తి తన ఆలోచనలు, ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తీసుకునే తప్పుడు నిర్ణయాలు నేరాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.
చెడుస్నేహాలు,తప్పుడు అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొన్నారు.మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని,కానీ చెడు స్నేహితుల ప్రభావంతో ఒక్కసారి డ్రగ్స్ లేదా ఇతర వ్యసనాలకు అలవాటు పడితే వాటి నుంచి బయటపడటం చాలా కష్టమని హెచ్చరించారు.డ్రగ్స్ వినియోగం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, అలాంటి కేసుల్లో అరెస్టయితే బెయిల్ కూడా సులభంగా లభించదని,తద్వారా విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని తెలిపారు. చదువుకునే వయసులో జైలు జీవితం ఎదురైతే జీవిత లక్ష్యాలను సాధించే అవకాశాలు కోల్పోతారని పేర్కొన్నారు.ఎవరైనా డ్రగ్స్ లేదా ఇతర చెడు వ్యసనాలకు ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని, “స్నేహితులే కదా” అనే కారణంతో వారి ప్రభావానికి లోనుకావద్దని విద్యార్థులకు సూచించారు. సరైన మార్గంలో నడిస్తేనే జీవితంలో విజయాలు సాధించగలమని, ఒకసారి తప్పుదారి పట్టి విలువైన సమయాన్ని కోల్పోతే తిరిగి ఆ సమయాన్ని పొందడం సాధ్యం కాదని ఎస్‌ఐ ఉషారాణి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *